డబుల్ అంటే మనోళ్లకు భలే సింపుల్.. దాసోహమయ్యేను రికార్డులు

వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడమంటే ఒకప్పుడు అందని ద్రాక్షగా ఉండేది. ఎంతో మంది వరల్డ్ క్లాస్ దిగ్గజ బ్యాటర్లకు సైతం ఇది సాధ్యం కాలేదు. 2010 కంటే ముందు పాక్ మాజీ సయిద్ అన్వర్ కొట్టిన 196 పరుగులే అత్యధికం. కానీ కట్ చేస్తే 2010 తర్వాత ఏకంగా 8 మంది ఆటగాళ్లు వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించారు. ఇందులో 5గురుభారతీయులే కావడం గమనార్హం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.. తొలిసారిగా ఈ సరిహద్దును చేరిపేసి అద్భుత రికార్డుకు శ్రీకారం చుట్టారు. సచిన్ 2010లో సౌతాఫ్రికాపై 200* పరుగుల తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేయడం షరా మాములైపోయింది. ఇప్పటి వరకు వన్డేల్లో 10 అంతర్జాతీయ డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ శుభ్‌మన్ గిల్ 208 పరుగులతో అద్భుత ద్విశతకం సాధించాడు. దీంతో వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టి అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 23 ఏళ్ల 132 రోజుల వయస్సులో ఈ ఘనత అందుకున్నాడు. అంతకు ముందు ఈ ఘనత ఇషాన్ కిషన్ పేరిట ఉండేది. అతడి వయస్సు 24 సంవత్సరాల 145 రోజులు. వన్డేల్లో ద్విశతకం చేయడం కష్టమనుకుంటున్న మన ఆటగాళ్లే ఐదుగురు ఈ ఘనత సాధించడం విశేషం.

ఈ నేపథ్యంలో భారతీయులే ఎక్కువగా ద్విశతకాలు నమోదు చేయడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సామర్థ్యం.. టీమిండియాను మొదటి నుంచి పరిశీలిస్తే.. ప్రపంచ క్రికెట్‌లో ఎప్పటి నుంచో అత్యుత్తమ బ్యాటర్లకు భారత్‌ కర్మాగారంగా మారింది. గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్, సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు వారి వారి తరంలో క్రికెట్‌ను శాసించారు. అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత జెనరేషన్‌లో శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ లాంటి దూకుడైన బ్యాటర్లు తమ దైన రోజున ప్రత్యర్థి బౌలింగ్ దాడులను కూల్చివేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. పరిస్థితుల ప్రభావం.. వన్డేల్లో 10 డబుల్ సెంచరీలు నమోదైతే.. అందులో ఏడు భారత బ్యాటర్లే చేశారు. ఇవి కూడా ఫ్లాట్‌గా ఉండే భారత ఉపఖండపు పిచ్‌ల్లోనే నమోదయ్యాయి. గ్వాలియర్ వేదికగా సచిన్ చేసిన మొదటి ద్విశతకం నుంచి తాజాగా హైదరాబాద్ వేదికగా శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ వరకు ఇక్కడే జరిగాయి. ఈ పిచ్‌లు బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తాయి. విదేశాల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటలేరు అనే వాదన వినిపించవచ్చు కానీ.. ఓవర్సీస్‌లో భారత బ్యాటర్లు చేసిన కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలు ఉన్నాయి. టౌంటన్ వేదికగా సౌరవ్ గంగూలీ కొట్టిన 183%, టన్‌బ్రిడ్జ్ వేదికగా వేల్స్‌లో కపిల్ దేవ్ 175*, పెర్త్‌లో రోహిత్ శర్మ 171* లాంటివి భారత ఆటగాళ్లు ఆడిన కొన్ని అసాధారణమైన ఇన్నింగ్స్.

Editor