సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఒక రిటైర్డ్ ఉద్యోగి తన జీవిత కాలపు సంపాదనలో ఏకంగా రూ.49 లక్షలు పోగొట్టుకున్న విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసి పదవీ విరమణ చేసిన బాధితుడికి జనవరిలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాము ఈడీ (ED) అధికారులమని, యూనిఫాంలో వీడియో కాల్ చేసి మీపై మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయని నమ్మించారు. కేసు మాఫీ కావాలంటే రూ.72.50 లక్షలు చెల్లించాలని బెదిరించారు. భయపడిపోయిన సదరు వ్యక్తి బ్యాంకుకు వెళ్లి ఫిక్స్‌డ్ డిపాజిట్లు రద్దు చేయాలని కోరగా, అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు రంగంలోకి దిగి అది ‘డిజిటల్ అరెస్ట్’ అనే సైబర్ మోసమని, భయపడాల్సిన అవసరం లేదని బాధితుడికి స్పష్టంగా వివరించారు. ఎవరైనా అధికారులు ఫోన్ ద్వారా అరెస్ట్ చేయరని అవగాహన కల్పించారు. అయితే, పోలీసులు అంతలా చెప్పినప్పటికీ, 15 రోజుల తర్వాత సైబర్ నేరగాళ్లు మళ్లీ ఫోన్ చేయడంతో బాధితుడు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈసారి పోలీసులకు గానీ, బ్యాంకు అధికారులకు గానీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. తన కుటుంబం బెంగళూరుకు మారిపోతుందని అబద్ధం చెప్పి ఎఫ్‌డీలను క్లోజ్ చేసి, తన సేవింగ్స్ అకౌంట్‌లోకి డబ్బు మార్చుకున్నారు.
ఆ తర్వాత పోలీసులకు తెలియకుండా కొత్త బ్యాంకు ఖాతా తెరిచి, అందులో నుండి నేరగాళ్లు చెప్పిన ఖాతాకు రూ.49 లక్షలను బదిలీ చేశారు. బ్యాంకు సిబ్బంది అడిగినా, తనకు తెలిసిన వారికే పంపుతున్నానని నమ్మించారు. నాలుగు రోజుల తర్వాత గానీ తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు, తిరిగి పోలీసులను ఆశ్రయించారు. ఒకసారి పోలీసులు కాపాడినా, రెండోసారి అదే తప్పు చేసి భారీగా నష్టపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు.
