పవన్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్లు: వ్యక్తిగత జీవితంపై విమర్శలతో సోషల్ మీడియాలో రచ్చ!

ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించిన ఫొటోలు బయటకు రావడంతో ఈ వివాదం మొదలైంది. పవన్ పర్యటనను జనసేన వర్గాలు సోషల్ మీడియాలో పంచుకోగా, పూనమ్ కౌర్ వాటిపై స్పందిస్తూ పవన్‌ను “మతమార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్” అని అభివర్ణించారు. తన వారసత్వాన్ని కాథలిక్ క్రైస్తవంలోకి మార్చుకున్న వ్యక్తి, ధర్మం కోసం త్యాగం చేసిన గురు తేగ్ బహదూర్ జీని ప్రార్థించడం సరికాదని ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు.

నెటిజన్లతో జరిగిన చర్చలో పూనమ్ మరిన్ని వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పవన్ తన పిల్లలను కారణం లేకుండా వదిలేశారని, వారి తల్లిని పవన్ సోదరుడు వేధించారని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. “నకిలీ చిరునవ్వులతో అధర్మాన్ని కప్పిపుచ్చలేరు” అంటూ పవన్ వ్యక్తిగత జీవితాన్ని మరియు ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో పరోక్ష విమర్శలకే పరిమితమైన పూనమ్, ఈసారి నేరుగా పవన్‌పై విరుచుకుపడటం గమనార్హం.

పూనమ్ వ్యాఖ్యలపై జనసేన అభిమానులు మరియు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఎవరినీ మతమార్పిడి చేయలేదని, భిన్నత్వంలో ఏకత్వానికి ఆయన పర్యటన నిదర్శనమని కొందరు సమర్థిస్తుండగా, పూనమ్ పదే పదే ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో దర్శకుడు త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్, ఇప్పుడు నేరుగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ను విమర్శించడం రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

Editor