‘క్రింజ్’ కామెంట్లపై అనిల్ రావిపూడి ఆవేదన.. నటుడు హర్ష వర్ధన్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలు అందుకుంటున్నా, సోషల్ మీడియాలో ఆయన సినిమాలపై వచ్చే ‘క్రింజ్ కామెడీ’ అనే విమర్శలు ఆయన్ని తీవ్రంగా బాధపెడుతుంటాయని నటుడు హర్ష వర్ధన్ వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, విమర్శకులు ఏమన్నా సరే ప్రేక్షకులకు ఏం కావాలో అనిల్‌కు బాగా తెలుసని కొనియాడారు. రాజమౌళి తర్వాత వరుసగా 9 హిట్లు అందుకున్న ఏకైక దర్శకుడిగా అనిల్ రికార్డు సృష్టించారని, ఆయన మేకింగ్ స్టైల్ బాక్సాఫీస్ వద్ద అజేయంగా దూసుకుపోవడానికి కారణమని హర్ష వర్ధన్ పేర్కొన్నారు.

ఇటీవల సంక్రాంతికి విడుదలై రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిరంజీవి చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’లో హర్ష వర్ధన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు యాక్సిడెంట్ జరిగిందని, ఆ సమయంలో తన వల్ల సినిమాకు నష్టం జరుగుతుందని భయపడి తనను తొలగించమని కోరినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే అనిల్ రావిపూడి మాత్రం హర్ష వర్ధన్‌పై నమ్మకంతో, “మీరు నడవకపోయినా పర్వాలేదు, సీన్లలో మీ క్యారెక్టర్ చాలా ముఖ్యం” అని చెప్పి తనను కొనసాగించారని ఆయన ఎమోషనల్ అయ్యారు.

అనిల్ రావిపూడి దర్శకుడిగా ఎప్పుడూ నటులపై అధికారం చలాయించరని, సెట్‌లో అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ తనకు కావాల్సిన అవుట్‌పుట్ తీసుకుంటారని హర్ష వర్ధన్ చెప్పారు. “నేను ఇష్టంగానే సినిమాలు చేస్తున్నాను, అందులో తప్పేముంది” అని అనిల్ తనతో పంచుకున్నట్లు ఆయన తెలిపారు. విమర్శకులు ఎన్ని ట్రోల్స్ చేసినా, చివరకు థియేటర్ల వద్ద ఆడియన్స్ ఇచ్చే తీర్పే అనిల్ గెలుపును చాటిచెబుతుందని హర్ష వర్ధన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Editor