Latest Posts

సిట్ విచారణలో ఎదురుదాడి చేసిన కేటీఆర్: “ప్రభుత్వం లీకులతో బతుకుతోంది”

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కొన్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు తనను ప్రశ్నించడం కంటే, తానే వారిని నిలదీశానని ఆయన స్పష్టం చేశారు. విచారణలో కొత్త విషయాలేమీ లేవని, అడిగిందే అడుగుతూ కాలయాపన చేశారని ఎద్దేవా చేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారని, ఈ విచారణ అంతా కేవలం ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికేనని కేటీఆర్ విమర్శించారు.

ముఖ్యంగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు హీరోయిన్లతో తనకు సంబంధం అంటగడుతూ వస్తున్న లీకులపై అధికారులను ప్రశ్నించగా, అందులో వాస్తవం లేదని వారే ఒప్పుకున్నారని తెలిపారు. కేవలం ఆరుగురు వ్యక్తుల మధ్య జరిగిన విచారణ వివరాలు బయటకు ఎలా వస్తున్నాయని, అధికారులను తాను బెదిరించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్వయంగా సిట్ అధికారులే ధ్రువీకరించారని ఆయన పేర్కొన్నారు. తమకూ కుటుంబాలు ఉంటాయని, ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం సరికాదని హితవు పలికారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం “లీకుల” మీద ఆధారపడి నడుస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. సొంత క్యాబినెట్ మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెబుతున్నారని, దానిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. సింగరేణి టెండర్లు, రెవెన్యూ మంత్రి కుమారుడి భూదందాల వంటి కీలక అంశాలపై సిట్ విచారణ ఎందుకు వేయడం లేదని నిలదీశారు. భయపడే వాళ్లమైతే కోర్టుల చుట్టూ తిరిగేవాళ్లమని, చట్టంపై గౌరవంతోనే విచారణకు హాజరయ్యానని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Editor