అనంతపురం జిల్లా -కళ్యాణదుర్గం
*వరుస చోరీల కేసుల్లో నలుగురు అరెస్ట్
*బంగారు ఆభరణాలు స్వాధీనం
కళ్యాణదుర్గం పట్టణ పరిధిలో వరుస ఇంటి చోరీలకు పాల్పడిన నలుగురు నిందితులను కళ్యాణదుర్గం టౌన్ పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కళ్యాణదుర్గం డి.ఎస్.పి రవిబాబు పర్యవేక్షణలో టౌన్ సీఐ వి. హరినాథ్, రూరల్ సీఐ సి. నీలకంఠేశ్వర్ తమ సిబ్బందితో కలిసి మంగళవారం మధ్యాహ్నం అనంతపురం రోడ్డులోని శ్రీ అక్కమ్మ బస్ షెల్టర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, నిందితులు బెట్టింగ్, ఇతర చెడు వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లి, పార్వతినగర్, ఒంటిమిద్ది ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో తాళాలు బద్దలు కొట్టి బంగారు ఆభరణాలు, నగదును అపహరించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులకు సంబంధించి బోయ నరసింహ అలియాస్ నరమోడు, పిట్టి తిప్పేస్వామి అలియాస్ అశోక్, బోయ మధుసూదన్, బలిజ అచ్చయ్యలను అరెస్టు చేశారు.
నిందితుల వద్ద నుంచి బంగారు నెక్లెస్, పెండెంట్‌తో కూడిన గొలుసు, బంగారు ఉంగరాలు, చెవి పోగులు, బంగారు కమ్మలు, సాదా బంగారు చైన్‌తో పాటు ఇతర బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువపై పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
