శ్రీశైలం పర్యటనకు వచ్చే వారు మల్లన్న దర్శనం మరియు డ్యామ్ అందాలే కాకుండా, నల్లమల అడవి అద్భుతాలను కూడా తెలుసుకోవచ్చు. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో ఉన్న ‘ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్’ (పర్యావరణ విజ్ఞాన కేంద్రం), ముఖ్యంగా పులుల జీవన విధానం, వన్యప్రాణుల గురించి తెలుసుకోవడానికి ఒక గొప్ప వేదిక. కేవలం ₹10 టికెట్‌తో పర్యాటకులు ఈ అడవి అనుభూతిని పొందవచ్చు.
ఈ కేంద్రంలో ముఖ్యంగా పులి చర్మం, పులి పుర్రె, పులి గోర్లు ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు, చిరుతపులి చర్మం, అడవి పంది పుర్రె వంటి ఇతర వన్యప్రాణుల ప్రదర్శనలు కూడా ఉన్నాయి. ఈ సెంటర్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ నెమలి, బట్టమేక పక్షి వంటి దాదాపు 15 రకాల పక్షుల అరుపులను (Bird calls) వినిపించే సౌకర్యం ఉంది.
పర్యాటకుల కోసం ప్రొజెక్టర్ ద్వారా ప్రత్యేక వీడియోలను ప్రదర్శిస్తారు. ఈ వీడియోలలో టైగర్ లైఫ్ సైకిల్, NSTR (నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్) విస్తీర్ణం మరియు పులుల సంచరించే విధానం గురించి సమగ్ర అవగాహన కల్పిస్తారు. శ్రీశైలం సందర్శించే పర్యాటకులు, ముఖ్యంగా పిల్లలు, నల్లమల అటవీ సంపద గురించి తెలుసుకోవడానికి ఈ విజ్ఞాన కేంద్రాన్ని తప్పక సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.
