ఇటీవల ఫ్లైట్ రద్దులు, భారీ ఆలస్యాల కారణంగా ఆపరేషన్ల సమస్యలు ఎదుర్కొన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ పూర్తిగా వాటి నుంచి బయటపడిందని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు. వాస్తవానికి డిసెంబర్ 10 నుంచి 15 మధ్య కార్యకలాపాలు సాధారణమవుతాయని ముందుగా ప్రకటించినప్పటికీ, అంచనా కంటే వేగంగా పునరుద్ధరణ జరిగిందని, డిసెంబర్ 9 నుంచే అన్ని సేవలు స్థిరంగా నడుస్తున్నాయని ఆయన తెలిపారు.
సంక్షోభం వచ్చిన తర్వాత వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు సీఈఓ వివరించారు. డిసెంబర్ 5న కేవలం 700 ఫ్లైట్‌లకు పరిమితమైన ఇండిగో, డిసెంబర్ 6న 1500కు, 7న 1650కి, 8న 1800 ఫ్లైట్‌లకు పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం, నెట్‌వర్క్‌లోని మొత్తం 138 గమ్యస్థానాలకు సేవలు తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని, టైమ్ మేనేజ్‌మెంట్‌లో కీలకమైన ‘ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్’ కూడా సాధారణ స్థాయికి చేరుకుందని ఎల్బర్స్ స్పష్టం చేశారు.
ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ఇండిగో ప్రత్యేక చర్యలు చేపట్టింది. రద్దైన ఫ్లైట్‌లకు ఎటువంటి ప్రశ్నలు లేకుండా రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేసి, లక్షల మందికి పూర్తి రీఫండ్ ఇచ్చినట్లు సీఈఓ ధృవీకరించారు. అలాగే, విమానాశ్రయాల్లో నిలిచిపోయిన వేలాది బ్యాగులను ప్రయాణికుల ఇళ్లకు పంపే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా మరింత బలమైన వ్యవస్థను అభివృద్ధి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
