హెచ్‌సీఏ నిర్లక్ష్యం: జింఖానా గ్రౌండ్‌ వద్ద ఎండలో పడిగాపులు కాసిన అండర్-14 యువ క్రికెటర్లు!

సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌ వద్ద మంగళవారం జరిగిన అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం తరఫున ఆడాలనే కలలతో వచ్చిన వందలాది మంది యువ క్రికెటర్లను ఉదయం నుంచి ఎండలో రోడ్డుపై నిలబెట్టి, కనీసం మైదానంలోకి కూడా అనుమతించకుండా హెచ్‌సీఏ నిర్లక్ష్యం ప్రదర్శించిందని వారు ఆరోపించారు.

యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఉదయం నుంచే జింఖానా మైదానానికి చేరుకున్నారు. అయితే, ఎండ తీవ్రత పెరుగుతున్నా, క్రీడా సంస్థలు చేయాల్సిన కనీస ఏర్పాట్లు అయిన నీడ కోసం టెంట్లు లేదా తగిన షెల్టర్‌ను కూడా హెచ్‌సీఏ కల్పించలేదని తల్లిదండ్రులు విమర్శించారు. కనీస వసతులు కూడా కల్పించకపోవడం, మైదానం లోపలికి అనుమతించకపోవడం నిర్వాహణ లోపాన్ని స్పష్టం చేస్తుందని, దీనిపై హెచ్‌సీఏ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

యువత భవిష్యత్తుపై శ్రద్ధ చూపాల్సిన క్రికెట్ అసోసియేషన్, కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఈ యువ క్రీడాకారుల ఉత్సాహం తగ్గుతుందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో తమదైన ముద్ర వేయాలని కలలు కనే చిన్నారుల ఆశలను దృష్టిలో ఉంచుకుని, హెచ్‌సీఏ తన పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Editor