శ్రీవారి భక్తులకు శుభవార్త: రక్తదానం చేస్తే తిరుమలలో వేగవంతమైన ప్రత్యేక దర్శనం!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి దర్శనానికి వేగవంతమైన, ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించింది. సాధారణంగా గంటల కొద్దీ క్యూ లైన్‌లలో వేచి చూడాల్సి వస్తున్న నేపథ్యంలో, రక్తదానం చేసే భక్తులకు TTD శుభవార్త అందించింది. రక్తదానం చేసిన వారికి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్‌తో పాటు, ఒక లడ్డూ మరియు ప్రశంసాపత్రాన్ని కూడా అందిస్తారు.

ఈ ప్రత్యేక దర్శన పథకం 1985 లో ప్రారంభించినప్పటికీ, చాలా మంది భక్తులకు దీని గురించి తెలియదు. తిరుమల కొండపై ఉన్న అశ్విని ఆసుపత్రిలో ప్రతిరోజు పరిమిత సంఖ్యలో భక్తులు రక్తదానం చేసేందుకు తగిన ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ మరియు అధికారిక ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అందులో సంప్రదించి, రక్తదానం చేసి భక్తులు వేగంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.

ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. కార్తీక మాసంలో కూడా శ్రీవారి సర్వదర్శనానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. నిన్న ఆదివారం ఒక్కరోజే 84 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు వచ్చినట్లు TTD ప్రకటించింది.

Posted Under AP
Editor