జూలై నాటికి వెలిగొండ పూర్తి: మార్కాపురం జిల్లా అభివృద్ధిపై చంద్రబాబు కీలక ప్రకటనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూలై నాటికి వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కాకముందే రిబ్బన్ కటింగ్ చేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న మార్కాపురం జిల్లా కలను తామే సాకారం చేశామని, ఈ ప్రాంత ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

దోర్నాల మండలం గంటవాని పల్లెలో రూ.456 కోట్లతో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాతో పాటు ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు కూడా సాగునీరు అందుతుందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయడానికి ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని, మిగిలిపోయిన రూ.2,540 కోట్ల పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేస్తామని అధికారులను ఆదేశించారు. రైతులతో కలిసి ఫీడర్ కాలువ పనులను స్వయంగా పరిశీలించిన ఆయన, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మార్కాపురం జిల్లాకు రూ.50 కోట్లతో నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే రూ.1300 కోట్ల వ్యయంతో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు. జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, ఉద్యాన పంటల సాగుకు మార్కాపురాన్ని కేంద్రంగా మారుస్తామని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తమ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి వివరించారు.

Posted Under AP
Editor