తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్‌లో వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో సీఎం ఒక విలాసవంతమైన ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసే ఇనుప కంచె (ఫెన్సింగ్) కోసమే ప్రభుత్వం రూ. 9 కోట్లు ఖర్చు చేస్తోందని, అందులో ఒక ఫుట్‌బాల్ కోర్టు కోసం మరో రూ. 5 కోట్లు కేటాయించారని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైతులకు అందాల్సిన రైతు భరోసా నిధులపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్, ఇప్పుడు నిధులు లేవంటూ సాకులు చెబుతోందని విమర్శించారు. మిస్ వరల్డ్ పోటీలకు, ఫుట్‌బాల్ క్రీడలకు వందల కోట్లు తగలేస్తున్న పాలకులకు, అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడానికి మాత్రం మనసు రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కన్నీళ్లతో పునాదులు వేసుకున్న ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో మనుగడ సాగించలేదని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, బడా కాంట్రాక్టర్ల బిల్లుల కోసం ప్రభుత్వం కేవలం ఈ ఆర్థిక ఏడాదే రూ. 25 వేల కోట్లు విడుదల చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. మూసీ ప్రాజెక్టు, ఇతర రోడ్ల నిర్మాణాల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న రేవంత్ సర్కార్, రైతు భరోసా నిధులపై మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించకపోవడం వారి కపట ప్రేమను సూచిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నిధులు జమ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ మాటను విస్మరించారని.. తక్షణమే రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
