ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గందరగోళంగా ఉండటంపై భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలపై ఆయన మండిపడుతూ, “టీమ్ మేనేజ్‌మెంట్ బ్యాటింగ్ ఆర్డర్‌తో మ్యూజికల్ ఛైర్స్ ఆట ఆడడం ఆపాలి” అంటూ విమర్శించాడు. ఆటగాళ్లను వారి సహజ స్థానాల్లోనే ఆడించాలని ఆయన స్పష్టం చేశారు.
రెండో టీ20లో భారత్ కేవలం 125 పరుగులకే ఆలౌట్ అవ్వడానికి బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన మార్పులే కారణమని రమేష్ పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తాను సాధారణంగా ఆడే నంబర్ 3 స్థానాన్ని వదిలి నంబర్ 4కి దిగగా, సంజు శాంసన్ నంబర్ 3లోకి వచ్చాడు. అంతేకాకుండా, శివం దూబే కంటే ముందు హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపగా, తిలక్ వర్మను నెంబర్ 5కి కిందకు పంపారు. ఈ నిర్ణయాలు ఆటగాళ్లలో గందరగోళం సృష్టించాయని రమేష్ విమర్శించారు.
రమేష్ తన అభిప్రాయాన్ని వివరిస్తూ, “సంజూ ఓపెనింగ్ నుంచి 5వ స్థానానికి, ఇప్పుడు తిరిగి 3వ స్థానానికి మారాడు. దీంతో ఎవరు తర్వాత బ్యాటింగ్‌కు వెళ్తారో ఆటగాళ్లు కూడా గందరగోళంలో ఉన్నారు” అని అన్నారు. ప్రతి ఆటగాడిని వారి ప్రధాన నైపుణ్యం మీదే మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టాలి. “మంచి కుక్కింగ్ చేసే వ్యక్తిని డ్రైవర్‌గా చేయలేం.. మంచి డ్రైవర్‌ను కుక్‌గా మార్చలేం” అంటూ ఉదాహరణ ఇచ్చారు. టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన నేపథ్యంలో, మూడో టీ20లోనైనా టీమిండియా తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
