ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, రోజురోజుకూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆ నమ్మకాన్ని సవాలు చేస్తున్నాయి. తాజాగా చేవెళ్ల వద్ద టిప్పర్ లారీ బస్సుపై పడటంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, మన రోడ్ల భద్రతా ప్రమాణాలు, డ్రైవింగ్ సంస్కృతి మరియు చట్టాల అమలుపై ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ ఘటన ఆర్టీసీ డ్రైవర్ల తప్పిదాల వల్ల కాకుండా, ఎదురుగా రాంగ్ రూట్‌లో, నిర్లక్ష్యంగా వచ్చిన వాహనం వల్ల జరిగింది.
ఈ ప్రమాదాలు కేవలం వాహనాల తప్పిదాలే కాదు, చట్టాల అమలులో ఉన్న లోపాలను కూడా చాటి చెబుతున్నాయి. ఉదాహరణకు, కర్నూలు బస్సు దుర్ఘటన డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగి 19 ప్రాణాలను బలితీసుకుంది. చట్టాలు ఉన్నా, వాటి అమలులో కఠినత లేకపోవడం వల్ల ప్రభుత్వం “జరిమానా కట్టి తాగి డ్రైవ్ చేయొచ్చు” అనే తప్పుడు సందేశాన్ని ప్రజలకు ఇస్తోందని చెప్పాలి. అంతేకాకుండా, ఆర్టీసీ బస్సుల్లో అదనపు ప్రయాణికులను ఎక్కించడం కూడా నిబంధనలకు విరుద్ధమైనదే.
ప్రమాదాలు జరగడానికి రోడ్ల పరిస్థితి కూడా ప్రధాన కారణంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు గుంటలు, వంపులు, ఎత్తుపల్లాలతో ఉండటం, రాత్రివేళ వీధి లైట్లు వెలగకపోవడం, స్పీడ్ బ్రేకర్ల ముందు హెచ్చరికలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ప్రతి ప్రమాదం తర్వాత ప్రభుత్వాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం తప్ప, ముందస్తుగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. రోడ్డు భద్రత కోసం చట్టాలను గౌరవించే సంస్కారం ప్రజల్లో, అధికారుల్లో రావాల్సిన అవసరం ఉందని ఈ దుర్ఘటన మరోసారి హెచ్చరించింది.
