శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ గ్రామంలోని ‘చిన్న తిరుపతి’ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం, ఏకాదశి పర్వదినాన జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు, మరో 20 నుంచి 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలిరాగా, ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య రద్దీ విపరీతంగా పెరగడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.
అధికారులు ప్రాథమిక నివేదికను విడుదల చేస్తూ, ఈ తొక్కిసలాటకు దారితీసిన ప్రధాన కారణాలను వెల్లడించారు. ఆలయం మొదటి అంతస్తులో ఉండటం వలన భక్తులు సుమారు 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో, అధిక రద్దీ కారణంగా రెయిలింగ్ విరిగిపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని హోంమంత్రి అనిత వివరించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మహిళా భక్తులే ఉండటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో విషాద వాతావరణం నెలకొనగా, పోలీసులు తక్షణమే స్పందించి సహాయక చర్యలను ప్రారంభించారు. గాయపడిన వారిని వెంటనే పలాస ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌ను అప్రమత్తం చేయగా, విశాఖపట్నం నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కూడా సంఘటన స్థలానికి చేరుకుంది. ఈ దుర్ఘటన ఆలయాల్లో రద్దీ నిర్వహణ, భద్రతా వ్యవస్థలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.
