సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, ‘ఆంధ్రా గోవా’గా పిలవబడే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సూరసాన యానాం బీచ్‌లో భారీ స్థాయిలో బీచ్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ, ముందస్తుగానే మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తల ఆనందరావు, కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ సారథ్యంలో ఈ పండుగను కళ్లు మిరుమిట్లు గొలిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ బీచ్ సువిశాల సాగర తీరం, తెల్లని ఇసుక తిన్నెలు, పచ్చని సరుగుడు తోటలు, ఉప్పుటేరుల్లో బోట్ షికార్లతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఈ ఫెస్టివల్ కోసం భారీగా నిధులు విడుదల చేయడంతో పాటు, చమురు, సహజ వాయు సంస్థల సీఎస్సార్ నిధుల ద్వారా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ట్రాఫిక్‌కు అవాంతరాలు కలుగకుండా ఇన్ రోడ్, ఔట్ రోడ్ లెక్కన రెండు విశాలమైన సీసీ రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. పర్యాటకులు ఉండేందుకు రిసార్ట్స్‌లు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, భద్రత, రవాణా వంటి అనేక అంశాలపై పర్యవేక్షించి ముందస్తు ఏర్పాట్లకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించేలా మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు. అలాగే, జాతీయ స్థాయి మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు, బోట్ షికార్, బీచ్ సాండ్ వెహికల్స్, స్కై డ్రైవింగ్, బెలూన్ డైవింగ్ వంటి పలు అడ్వెంచర్ ఈవెంట్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల వసతి సౌకర్యాల కోసం త్వరలో ‘ఆంధ్రాగోవా బీచ్ ఫెస్టివల్’ అనే వెబ్‌సైట్ ద్వారా స్లాట్లు తెరుస్తామని నిర్వాహకులు తెలిపారు. అమలాపురం నుంచి ఎస్.యానాం బీచ్‌కు చేరుకోవడానికి కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
