తెలంగాణ యువకుడు మణిసాయి వర్మకు జాతీయ గుర్తింపు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా NSS ఉత్తమ సేవా అవార్డు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు వంగపల్లి మణిసాయి వర్మ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా NSS ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన మణిసాయి వర్మ, విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఈ నెల 6న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

మణిసాయి వర్మ $2019$ నుంచి $2025$ వరకు జాతీయ సేవా పథకం (NSS) ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన స్కిల్ డెవలప్‌మెంట్, మహిళా సాధికారత, వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించడం, స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, డిజిటల్ ఇండియా వంటి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. మారుమూల గ్రామం నుండి వచ్చిన తనకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

తన తండ్రి వంగపల్లి మల్లేశంను స్ఫూర్తిగా తీసుకొని ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు మణిసాయి వర్మ తెలిపారు. ఓ గ్రామీణ ప్రాంతంలో ఉండే యువకుడు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం తన జీవితంలో మర్చిపోలేని క్షణాలని ఆయన పేర్కొన్నారు. తమ కుమారుడు దేశ రాష్ట్రపతి చేతుల మీదుగా NSS అవార్డు అందుకోవడం తమ కుటుంబంతో పాటు ఈ ప్రాంతానికి పేరు తీసుకురావడం ఎంతో గర్వంగా ఉందని ఆయన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Editor