నజాం రాష్ట్రంలో వాహనం నడిపిన
మొదటి మహిళ ~
మదర్ థెరిస్సా కాదు, అంతకు మించిన సామాజిక సేవకురాలు ~
రాణి జనుంపల్లి కుమిదినిదేవి ( 1911 ~ 2009)
~~~~~~~~~~~~~~~~~~~
ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరానికి మొదటి మహిళా మేయరుగా రాణి కుముదిని దేవి పనిచేశారు.
▪️జీవితం వివరాలు
నిజాం సంస్థానానికి ఉప ప్రధానమంత్రిగా పని చేసిన వడ్డేపల్లి జామిందార్ పింగళి వెంకటరామారెడ్డి , చూడామణి దంపతులకు కుముదినిదేవి వరంగల్ జిల్లా వడ్డెపల్లిలో 1911 జనవరి 23న జన్మించింది.
హైదరాబాద్ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో తన ప్రాథమిక విద్య కొనసాగింది. చదువుతో పాటుగా గుర్రపు స్వారీ , ఈత, డ్రైవింగ్, వంటి విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది.హాకీ, ఫుట్‌బాల్ టెన్నిస్
వంటి క్రీడల్లోనూ ఆరితేరింది. సహజంగా ఆడపిల్లలు ఇష్టపడే కుట్లు అల్లికలు కూడా నేర్చుకుంది.
కుముదినిదేవి వివాహం వనపర్తి సంస్థానానికి చెందిన జనుంపల్లి రాజా రాందేవ్ రావుతో 1928 లో జరిగింది. వనపర్తి సంస్థానంలో ముగ్గురు రామేశ్వరరావులు ఉన్నారు. వీరిలో రెండవ రాజా రామేశ్వరరావు కుమారుడే రామ్ దేవరావ్. ఆ విధంగా కుముదినిదేవి వనపర్తి సంస్థాన కోడలు అయ్యింది.
▪️డివిజన్ కౌన్సిలర్ గా
1955 లో రాజకీయాల్లోకి ప్రవేశించింది.1955 లోనే
సికింద్రాబాద్ బేగంపేట డివిజన్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యింది. 1964 వరకు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా కొనసాగింది .
▪️హైదరాబాద్ మేయర్ గా
1962లో హైదరాబాద్ తొలి మహిళా మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కుముదినీదేవి చరిత్ర సృష్టించారు.
1962 ~ 1963 వరకు ఒక సంవత్సరం ఈ పదవిలో కొనసాగారు.
1962 లోనే మూసీ నది వరదలు వచ్చాయి. ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు నిధుల కోసం విజ్ఞప్తి యగా, ప్రధానమంత్రి సహాయక నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు విడుదల అయ్యాయి.. వరదల కారణంగా పౌర జీవనం అతలాకుతలం కావడంతో, వరద నివారణ ప్రణాళికను కూడా ఆమె సిద్ధం చేసింది.
మేయర్ గా కొనసాగుతున్న సమయంలో నగర సుందరికరణ కోసం కృషి చేస్తూ, అందులో భాగంగా నౌబత్ పహాడ్ పబ్లిక్ పార్క్ ఏర్పాటు చేసింది. పక్కనే ఉన్న కొండను ప్రభుత్వం MCHకి విడుదల చేయగా, తర్వాత కాలంలో దానిపై బిర్లా ఆలయం… బిర్లా ప్లానిటోరియం నిర్మించబడ్డాయి.
1962లో చైనీయులు భారతదేశాన్ని ఆక్రమించినప్పుడు, ఉత్తర సరిహద్దులో వున్న భారత సైన్యానికి పంపాల్సిన నిధులు, ఆహారం దుస్తులను సేకరించేందుకు డిఫెన్స్ వెల్ఫేర్ స్టాల్‌ను ఏర్పాటు చేయడంలో సహాయపడింది.
▪️వనపర్తి శాసనసభ్యురాలిగా
1962 నుంచి 1972 వరకు వనపర్తి శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి కుముదిని దేవి ప్రాతినిధ్యం వహించారు.
1962 లో స్వతంత్ర అభ్యర్థి జి.ఎస్.రెడ్డి పై ~
1967 లో స్వతంత్ర అభ్యర్థి జగన్నాథరెడ్డిపై
▪️మొదటి మహిళా వాహన చోదకురాలిగా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం,
నిజాం రాష్ట్రంలో వాహనం నడిపిన మొదటి మహిళగా గుర్తించబడింది.
▪️సామాజిక సేవా కార్యక్రమాలు
శివానంద ఆశ్రమం ఆధ్వర్యంలోనే అన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి
1 ) శివానంద పునరావాస గృహం
( Shivananda Rehabilitation Home )
1957 లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత, జహీరాబాద్‌లో ఒక లెప్రసీ హోమ్ సందర్శిచింది. అక్కడ కుష్టు వ్యాధిగ్రస్తుల సాధక బాధలు చూసి చలించి
బేగంపేట పరిధిలో కుష్టు వ్యాధి చికిత్స కేంద్రం పెట్టాలని కౌన్సిల్లో ప్రతిపాదన చేసింది..దీన్ని మిగతా కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించారు. ఈ కారణంతో 1958 లో హైదరాబాదు కూకట్‍పల్లిలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసి,
” శివానంద పునరావాస గృహం ” పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచెసింది . ఈ సంస్థ కుష్టు వ్యాధిగ్రస్తులకు , క్షయ వ్యాధి గ్రస్తులకు, డయాబెటిస్ రోగులకు, హెచ్ఐవి రోగులకు ఉచిత చికిత్స, పునరావాసం వంటి సేవల్ని కొనసాగిస్తున్నది. ఈ సంస్థ 300 లకు పైగా రోగులకు వసతి కల్పించే పెద్ద ప్రసిద్ధ సంస్థగా అభివృద్ధి చెందింది.ఈ ఆశ్రమం ముందు కుముదినీదేవి విగ్రహం నెలకొల్పారు.
తన ఆధ్యాత్మిక గురువైన శివానంద స్వామి పేరును ఆశ్రమానికి పెట్టుకుంది.
చిరునామా ~
శివానంద పునరావాస గృహం జాతీయ రహదారి నం. 65,
మెట్రో పిల్లర్ నం. 788 A, కూకట్‌పల్లి, హైదరాబాద్ 500 072.
sivanandahome@gmail.com
Phone,: 9642869664 /
7095002185
2) సేవాసమాజ బాలికా నిలయం
విజయనగర్ కాలనీలో అనాథబాలికల కోసం 1958 లోనే ” సేవాసమాజ బాలికా నిలయం ” ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ ఎందరో అనాధ ఆడపిల్లలకి ఉపాధి, ఆశ్రయం కల్పిస్తోంది.
3) చూడామణి వృద్ధ ఆశ్రమం
1993లో వృద్ధ మహిళల ఆదరణ కోసం ” చూడామణి వృద్ధ ఆశ్రమం ” తన తల్లి చూడామణి స్మృత్యర్థం స్థాపించారు,
4) ఖైదీల పిల్లలకు పాఠశాల
ఖైదీల పిల్లలకు ఆశ్రమం ఆవరణలోని పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తారు.
5) ఖైదీలకు శిక్షణ
ఖైదీలకు శిక్షణ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఒక వర్క్‌షాప్ ఉంది. ఎంపిక చేయబడిన శిక్షణార్థులకు స్వయం ఉపాధి పొందడానికి రుణాలు కూడా ఇవ్వబడతాయి.
6 ) పురేందర్ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ~
మరణించిన తన మొదటి బిడ్డ పురేందర్ స్మృత్యర్థం
ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది.
7) చైతన్య మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ~ స్థాపించారు. ప్రస్తుతం కుముదినిదేవి రెండవ కోడలు జ్యోతి , చైతన్య మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ చూసుకుంటున్నారు.
8) బెంగాలీ శరణార్థులకు స్థిరనివాసం
1971 లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో , నాగార్జున సాగర్ వద్ద శిబిరాలు ఏర్పాటు చేసుకున్న బెంగాలీ శరణార్థుల స్థిరనివాసానికి మనవీయ సహాయం చేసింది.
9 ) రాందేవ్ రావు ఛారిటీ హాస్పిటల్.
లాభాపేక్షలేకుండా , కేవలం నిర్వహణ నిమిత్తం
నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తూ, పేద నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి 2002లో తన భర్త రాందేవ్ రావు పేరు మీద కూకట్పల్లిలోనే 80 పడకల జనరల్ ఆసుపత్రిని స్థాపించింది.
అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ యూనిట్, ఫిజియోథెరపీ విభాగం మొదలైన వాటితో పూర్తి స్థాయి జనరల్ ఆసుపత్రిగా ప్రస్తుతం ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నది .
ఇక్కడ నిరు పేదల కోసం ఉచిత క్లినిక్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
రెండో కొడుకు విక్రమ్‌దేవ్‌రావ్, పెద్ద కోడలు మీరారావు ప్రస్తుతం ఆసుపత్రిని పర్యవేక్షిస్తున్నారు.
▪️కొనసాగిన వివిధ హోదాలు
తిరుపతి తిరుమల దేవస్థానం (టిటిడి) పాలకమండలి సభ్యురాలిగా కొనసాగారు.
ప్రభుత్వ హస్తకళల ఎంపోరియం ‘లేపాక్షి ‘ కు ఛైర్మన్‌గా కొనసాగారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పాలకమండలి సభ్యురాలిగా కొనసాగారు.
నిజామియా మహిళా విద్యా ట్రస్ట్‌కు వైస్-చైర్‌పర్సన్ & ట్రస్టీ.
ఆంధ్రప్రదేశ్ డఫ్ అండ్ డంబ్ ఎసోపియేషన్ అధ్యక్షురాలిగా కొనసాగారు.
▪️పురస్కారాలు – గౌరవాలు
1975 లో జోంటా ఇంటర్నేషనల్ – మెరిటోరియస్ అవార్డు.
1992 లో ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ నుండి పురస్కారం
1994 లో యుధ్వీర్ స్మారక పురస్కారం.
1994 లో భారత్ సాంస్కృతిక సమైక్యత కమిటీ నుండి పురస్కారం.
1994 లో జెయింట్స్ ఇంటర్నేషనల్ అవార్డు.
1996 లో స్వరాజ్ జాగరణ్ మంచ్ అవార్డు.
1997 లో మెహదీ నవాజ్ జంగ్ సెంటెనరీ హ్యూమన్ రైట్స్ అవార్డు .
1997 లో భరత్ కమలాకర్ ఛారిటబుల్ ట్రస్ట్ నుండి పురస్కారం.
1999 లో రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నుండి గౌరవ పురస్కారం.
▪️కుటుంబం
రాజా రాందేవ్ రావ్ ~ రాణి కుమిదిని దేవి దంపతులకు నలుగురు సంతానం.వారు ~
రంథిదేవ్ రావ్, విక్రమదేవ్ రావ్, లక్ష్మి, భారతి.ఏడుగురు మనవలు ఎనిమిది మంది మనవరాళ్ళు ఉన్నారు.
▪️కాలధర్మం
వృద్ధులు, వికలాంగులు , అనాధలు, పేదలు, వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం తన చివరి రోజుల వరకు నిరంతరం అంకితభావంతో పనిచేసిన కుముదినిదేవి 2009లో తన 98 వ ఏట వృద్ధాప్యంతో మరణించింది.
వ్యాసకర్త : డా. తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆధారం :
Vyus channel లో కుమిదినిదేవి కుమారుడు విక్రమ్ దేవ్ రెడ్డి ఇంటర్వ్యూ, శివానంద ఆశ్రమం వెబ్సైటు, ఆకాశవాణి ఆదిలాబాద్ లో డాక్టర్ బి ప్రతాపరెడ్డి గారి ” కుమిదినిదేవి జ్ఞాపకాలు ” ప్రసంగం
& వివిధ తెలుగు ఆంగ్ల పత్రికల్లో వచ్చిన కథనాలు
& డిజిటల్ లైబ్రరీ