ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కొనసాగిన ఉత్కంఠతకు తెరపడింది. ఇప్పటికే జనసేన పార్టీ తరపున నాగబాబు నామినేషన్ సమర్పించారు. ఇక మిగిలిన 4 స్థానాలపై గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చ సాగిన క్రమంలో ఎట్టకేలకు 3 స్థానాల అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. మిగిలిన ఆ ఒక్క స్థానం బీజేపీకి కేటాయించగా, బీజేపీ నుండి అభ్యర్థి ఎవరన్నది తెలియాల్సి ఉంది.
తాజాగా టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకే కేటాయించడం విశేషం. వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సంకల్పంతో టీడీపీ తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా రెండు సీట్లు జనసేన, బీజేపీకి కేటాయించగా మిగిలిన 3 సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో రెండు బీసీలకు, ఒకటి ఎస్సీకి టీడీపీ అధిష్టానం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేయడం విశేషం.
రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. పార్టీలో మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉన్న బీదా రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది.
యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు నేతలూ బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారిని బట్టి చూస్తే ఆ వర్గాలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యత ఇదేనంటూ టీడీపీ అంటోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ నెల 10వ తేదీన అనగా సోమవారం నామినేషన్ సమర్పించేందుకు ఆఖరి రోజు కావడంతో అభ్యర్థుల ఖరారు సాగిందని చెప్పవచ్చు. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కానీ అధిష్టానం కొన్ని రాజకీయ సమీకరణాలతో వర్మను పక్కన పెట్టినట్లు సమాచారం. అయితే నామినేటెడ్ పోస్టుల్లో కీలక పదవి వర్మకు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వర్మ ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయం చుట్టూనే ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో వర్మ పేరు లేకపోవడంతో, వర్మ ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది.
ఆ ఒక్క ప్రకటన కోసమే..
ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో 3 టీడీపీ, ఒకటి జనసేన, మరొకటి బీజేపీ పంచుకున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అందుకై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ నాయకులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక బీజేపీ నుండి అభ్యర్థిని ప్రకటిస్తే ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానంపై ఉన్న ఉత్కంఠతకు తెర పడనుంది. మొత్తం మీద రేపు నాగబాబు మినహా మిగిలిన అభ్యర్థులు నామినేషన్ సమర్పిస్తారని చెప్పవచ్చు.