గీత దాటితే సొంత పార్టీ నేతలైనా ఒకటేనన్న తరహాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా తన పార్టీకి చెందిన ఓ నేతకు పవన్ ఝలక్ ఇచ్చారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టపరిచే చర్యలకు పాల్పడితే సహించేది లేదన్న తన మార్క్ ను పవన్ చూపించారని జనసేన క్యాడర్ అంటోంది. ఇంతకు పవన్ ఝలక్ ఎదుర్కొన్న ఆ నేత ఎవరు? అసలేం జరిగిందో తెలుసుకుందాం.
పిఠాపురంలో ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్టీ క్యాడర్ మొత్తం సభ విజయవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి తరుణంలో పార్టీకి చెందిన ఓ నేతపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల లైన్ దాటితే చాలు.. పవన్ పక్కన పెట్టడం ఖాయమన్న సంకేతాలు పలు దఫాలు వ్యక్తమయ్యాయి. తిరుపతి జనసేన నాయకులు కిరణ్ రాయల్ విషయంలో పార్టీ కొద్దిరోజులు దూరంగా ఉండాలని సూచించిన విషయం తెల్సిందే. ఓ మహిళ చేసిన ఆరోపణలు అందుకు కారణం కాగా, ప్రస్తుతం ఆ మహిళే తప్పంతా తనదేనంటూ వక్కాణించి చెప్పడం విశేషం. అయినప్పటికీ ఇప్పటికీ కిరణ్ రాయల్ మళ్లీ పార్టీలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉందా లేదా అనే విషయంపై పార్టీ ఇంకా నిర్ధారించలేదనే చెప్పవచ్చు.
ఇలాంటి సమయంలో ఓ జనసేన ఇంచార్జ్ చేసిన నిర్వాకంపై జనసేన అధిష్టానం సీరియస్ అయింది. ఏకంగా ఆ నేతపై చర్యలు తీసుకోవాలని కోరింది. అసలేం జరిగిందంటే.. ప్రత్తిపాడు జనసేన ఇన్చార్జి వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల ప్రత్తిపాడు సిహెచ్‌సీ వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. రోగులకు వైద్యం చేస్తున్న సమయంలో డాక్టర్ శ్వేతకు తమ్మయ్యబాబు ఫోన్ చేశారని, ఆ సమయంలో ఆయనెవరో తెలియదని డాక్టర్ చెప్పినట్లు ప్రచారంలో ఉంది. అప్పుడే కోపంతో వైద్యశాలకు వచ్చిన తమ్మయ్య బాబు స్థానిక వైద్య సిబ్బందితో పాటు డాక్టర్ పై కూడా దురుసుగా ప్రవర్తించినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో పార్టీ అధిష్టానం స్పందించింది.
జనసేన పార్టీ అధికారికంగా ఈ అంశానికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్తిపాడు జనసేన ఇన్చార్జి వరుపుల తమ్మయ్య బాబు వ్యవహార శైలి పట్ల పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు, చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అక్కడి అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించినట్లు ఆ ప్రకటన సారాంశం. అంతేకాకుండా ప్రత్తిపాడు సీహెచ్.సి. వైద్యురాలు డా. శ్వేత పట్ల జనసేన ఇన్చార్జి తీరుపై విచారించి తక్షణమే నివేదిక ఇవ్వాలని కాకినాడ జిల్లా అధ్యక్షుడికి అధిష్టానం ఆదేశించింది.
దీనితో పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు క్యాడర్ అభిప్రాయ పడుతోంది. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరూ ప్రవర్తించవద్దని హెచ్చరించినట్లు భావించవచ్చు. కడప జిల్లాలో ఎంపీడిఓపై దాడి జరిగిన సమయంలో పవన్ మాట్లాడుతూ.. అధికారులపై ఎవరు దాడికి పాల్పడినా, వారి విధులకు ఆటంకం కలిగించినా ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ దశలోనే ప్రత్తిపాడు జనసేన ఇన్చార్జి వరుపుల తమ్మయ్య బాబుపై సీరియస్ యాక్షన్ లోకి దిగినట్లు భావించవచ్చు.