ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం

వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం పతాక స్థాయికి చేరింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది.

రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.

తాజాగా గాజాలోని అల్- అహ్లీ అల్- అరబ్బీ ఆసుపత్రిపై దాడి సంభవించింది. ఈ ఘటనలో 500 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. గాజా ఉత్తర ప్రాంతంలోని అల్ ఉమిలూన్ మార్గంలో ఉంటుంది ఆసుపత్రి. మొత్తం గాజా స్ట్రిప్‌లోనే అతి పెద్ద ఆసుపత్రిగా చెబుతుంటారు. ఈ యుద్ధంలో గాయపడిన వారిలో చాలామంది ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అర్ధరాత్రి దాటిన తరువాత అల్- అహ్లీ ఆసుపత్రిపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఇజ్రాయెల్. దీనిపై బాంబులను జారవిడిచింది. ఈ దాడిలో భారీ శబ్దం చేస్తూ పేలిపోయిందా ఆసుపత్రి. కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి మంటలు అంటుకున్నాయి. ఉవ్వెత్తున చెలరేగాయి. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకూ వినిపించిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ దాడి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, జోర్డాన్ రాజు అబ్దుల్లా 2తో ఫోన్‌లో మాట్లాడారు. తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ భద్రత విభాగంతో సమావేశం అయ్యారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ దాడికి తామే పాల్పడినట్ల వస్తోన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఈ ఘటన వెనుక తమ ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. హమాస్ మిలిటెంట్ల రాకెట్ల దాడి మిస్ ఫైర్ అయిందని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియో ఫుటేజీలను విడుదల చేసింది. గురి తప్పిన హమాస్ రాకెట్లు అల్- అహ్లీ బాప్టిస్ట్ ఆసుపత్రిని విధ్వంసానికి గురి చేసినట్లు పేర్కొంది.

ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. గాజాపై తాము రాకెట్ల వర్షాన్ని కురిపించిన మాట వాస్తవమే అయినప్పటికీ అందులో ఏ ఒక్కటి కూడా అల్- అహ్లీ బాప్టిస్ట్ ఆసుపత్రిని తాకలేదని ఐడీఎఫ్ రియర్ అడ్మిరల్ డేనియల్ హగరి వివరణ ఇచ్చారు. ఆసుపత్రి మీదుగా వెళ్లిన రాకెట్లు అక్కడి హమాస్ స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాయని చెప్పారు.

ఈ దాడి పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి హమాస్ మిలిటెంట్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. హమాస్ మిలిటెంట్లు గతంలోనూ అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇజ్రాయెలీయన్ల ఊచకోతకు పాల్పడిన అనుభవం వారికి ఉందనే విషయం ప్రపంచం మొత్తానికీ తెలుసని అన్నారు.

ఇజ్రాయెలియన్లను క్రూరంగా హతమార్చిన హమాస్ మిలిటెంట్లకు తమ సొంత వారిని కూడా చంపగలరని నెతన్యాహు విమర్శించారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్.. ఈ ఘటనను హమాస్ రక్తదాహానికి నిదర్శనంగా అభివర్ణించారు. ఈ ఘటనకు తామను బాధ్యులను చేయడం సరికాదని అన్నారు.

YES9 TV