వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం పతాక స్థాయికి చేరింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది.
రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.
తాజాగా గాజాలోని అల్- అహ్లీ అల్- అరబ్బీ బాప్టిస్ట్ ఆసుపత్రిపై దాడి సంభవించింది. ఈ ఘటనలో 500 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. గాజా ఉత్తర ప్రాంతంలోని అల్ ఉమిలూన్ మార్గంలో ఉంటుంది ఆసుపత్రి. మొత్తం గాజా స్ట్రిప్‌లోనే అతి పెద్ద ఆసుపత్రిగా చెబుతుంటారు. ఈ యుద్ధంలో గాయపడిన వారిలో చాలామంది ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అల్- అహ్లీ ఆసుపత్రిపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఇజ్రాయెల్. దీనిపై బాంబులను జారవిడిచింది. రాకెట్లను సంధించింది. దీనితో భారీ శబ్దం చేస్తూ పేలిపోయిందా ఆసుపత్రి. కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి మంటలు అంటుకున్నాయి. ఉవ్వెత్తున చెలరేగాయి. హాహాకారాలతో మార్మోగిపోయిందా ప్రాంతం.
ఈ దాడి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, జోర్డాన్ రాజు అబ్దుల్లా 2తో ఫోన్‌లో మాట్లాడారు. తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ భద్రత విభాగంతో సమావేశం అయ్యారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ దాడికి తామే పాల్పడినట్ల వస్తోన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఈ ఘటన వెనుక తమ ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. హమాస్ మిలిటెంట్ల రాకెట్ల దాడి మిస్ ఫైర్ అయిందని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియో ఫుటేజీలను విడుదల చేసింది. గురి తప్పిన హమాస్ రాకెట్లు అల్- అహ్లీ బాప్టిస్ట్ ఆసుపత్రిని విధ్వంసానికి గురి చేసినట్లు పేర్కొంది.
ఆసుపత్రిపై దాడి ఘటన తరువాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఇస్లామిక్ దేశాలు ఏకం అవుతున్నాయి. నిరసనలకు దిగాయి. పాలస్తీనాకు మద్దతు ప్రకటించాయి. ఈ దాడిని అత్యంత అమానవీయ ఘటనగా అభివర్ణించాయి. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించాయి.
అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కూ నిరసనల సెగ తగిలింది. యుద్ధాన్ని నివారించడానికి ఆయన తలపెట్టిన మధ్య తూర్పు దేశాల పర్యటన కుదించుకోవాల్సి వచ్చింది. పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి మూడు- నాలుగు గంటల ముందే ఈ ఘటన సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జో బైడెన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యాహ్నానికి ఆయన ఇజ్రాయెల్‌లో ల్యాండ్ అవుతారు. మేరీల్యాండ్‌లో గల అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్నారు. ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఆయన బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమౌతారు.
దీని తరువాత జోర్డాన్, పాలస్తీనా, ఈజిప్ట్‌లల్లో పర్యటించాల్సి ఉంది. జోర్డాన్ రాజు అబ్దుల్లా 2, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫటా ఎల్- సిసి, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో భేటీ కావాల్సి ఉంది. యుద్ధాన్ని నివారించడానికి వారితో చర్చించేలా జో బైడెన్ అజెండాను రూపొందించుకున్నారు.
అదే సమయంలో ఆసుపత్రిపై దాడి సంభవించడంతో ఆయా దేశాలన్నీ కూడా జో బైడెన్‌తో తమ అత్యున్నత స్థాయి సమావేశాన్ని రద్దు చేసుకున్నాయి. బైడెన్‌తో భేటీ కావట్లేదని తెలిపాయి. ఇజ్రాయెల్‌ను ఏకాకిని చేయడానికి ఇతర దేశాల మద్దతును కూడా కూడగట్టుకుంటామని మహ్మద్ అబ్బాస్ చెప్పారు.
