Latest Posts

జైల్లోనే చంద్రబాబు దసరా ! మళ్లీ రిమాండ్ పొడిగింపు..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో బ్యాడ్ న్యూస్. స్కిల్ కేసులో ఆయన రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది.

ప్రస్తుతం ఆయన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్ లో ఉండటం, హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై ఎటూ తేలకపోవడంతో చంద్రబాబు రిమాండ్ ను నవంబర్ 1 వరకూ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఇవాళ నిర్ణయం ప్రకటించింది.

స్కిల్ కేసులో గతంలో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో సీఐడీ ఆయన్ను ఇవాళ వర్చువల్ గా జడ్జి ముందు హాజరుపర్చింది. దీంతో విచారణ జరిపిన న్యాయమూర్తి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జైల్లో పరిస్ధితులపై చంద్రబాబును ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో తన భద్రతపై అనుమానాలు ఉన్నట్లు చంద్రబాబు జడ్జికి తెలిపారు. అయితే దాన్ని రాతపూర్వకంగా తనకు తెలియజేయాలని సూచించారు. అలాగే జైలు అధికారుల్ని చంద్రబాబు లేఖను తనకు పంపాలని ఆదేశించారు.

మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్దితిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యాయమూర్తి వాటిపైనా ఆయన్ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. అలాగే ఆయన హెల్త్ రిపోర్టులను కోర్టుకు అందించాలని జడ్జి సూచించారు. దీంతో సీఐడీ అధికారులు చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ను కోర్టుకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇచ్చే విధంగా ఆదేశించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది.

అటు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇవాళ దీనిపై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. సుప్రీంకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ పై తీర్పు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పినట్లు తెలిసింది. అయితే మధ్యాహ్నం విచారణ తర్వాత చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.

Posted Under AP
YES9 TV