క్రికెట్‌లో పసికూన.. ఆఫ్ఘనిస్తాన్‌.. సీనియర్‌ జట్టు అయిన పాకిస్తాన్‌కు చుక్కలు

క్రికెట్‌లో పసికూన.. ఆఫ్ఘనిస్తాన్‌.. సీనియర్‌ జట్టు అయిన పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. హంబనోటా వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓడించినంత పనిచేసింది.

ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్‌ తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది. చివరి రెండు ఓవర్లలో పాక్‌ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. షాదాబ్‌ ఖాన్, నసీం షా తమ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో ఫజల్హాక్‌ ఫారూఖీ మూడు వికెట్లతో అదరగొట్టాడు. దీంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే పాకిస్తాన్‌ 2-0తో సిరీస్‌ సొంతం చేసుకుంది.

ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోరు..
రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్ఘ్గనిస్తాన్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. ఓపెనర్‌ గుర్బాజ్‌ (151; 14 ఫోర్లు, 3 సిక్సు్ల) సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్‌ ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (80; 6 ఫోర్లు, 2 సిక్సు్ల)తో కలిసి తొలి వికెట్‌కు 227 పరుగులు జోడించాడు. అనంతరం 301 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 49.5 ఓవర్లలో 9 వికెట్లకు 302 పరుగులు చేసి గెలిచింది. పాక్‌ బ్యాటర్లలో ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (91; 4 ఫోర్లు), షాదాబ్‌ ఖాన్‌(48; 3 ఫోర్లు, 1 సిక్స్‌), బాబర్‌ ఆజమ్‌ (53; 6 ఫోర్లు) రాణించారు

అజమ్‌ మరో ఘనత…
ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్‌ ఆజం నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేతో బాబర్‌ తన వందో ఇన్నింగ్స్‌ మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 53 పరుగులతో అదరగొట్టిన ఆజం.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

5 వేల పరుగులు..
బాబర్‌ తన 100 వన్డే ఇన్నింగ్స్‌లో 5,142 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా లెజెండ్‌ హసీం ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లా తన వంద ఇన్నింగ్స్‌లో 4,946 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌ ఆమ్లా రికార్డును బాబర్‌ బ్రేక్‌ చేశాడు. బాబర్‌ వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 18 సెంచరీలు, 27 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

YES9 TV