ఘనంగా తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ జయంతి మహోత్సవం…

అనంతపురం, మార్చి 13 :

– *జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో శుక్రవారం తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్, డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనరసింహమూర్తి, బిసి వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.*

– *ఈ సందర్భంగా డిఆర్ఓ ఏ.మలోల మాట్లాడుతూ మొల్ల జీవితం నేటి తరం మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సహజ కవయిత్రిగా ఎటువంటి రాజపోషణ లేకుండా, కేవలం తన భక్తి మరియు ప్రతిభతో రామాయణాన్ని తేటతెలుగులో అందించిన మహనీయురాలు మొల్లమాంబ అందరికీ మార్గదర్శకంగా నిలిచిందన్నారు. దైవభక్తితో వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతము నుండి సరళంగా అందరికి అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలోకి కేవలం 5 రోజులోనే అనువదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ అని అన్నారు. మొల్లమాంబ అద్భుతమైన సాహిత్యం వెలకట్టలేనిదన్నారు. సంస్కృత పదాల కంటే తెలుగు నుడికారానికే ప్రాధాన్యతనిచ్చి, సామాన్యులకు సైతం రామాయణాన్ని అర్థమయ్యేలా చేసిన ఘనత మొల్లమాంబకే దక్కుతుందన్నారు. అధికారికంగా మొల్లమాంబ జయంతి మహోత్సవం నిర్వహించామన్నారు. మొల్లమాంబ లాంటి గొప్పవారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శనివారం, ఆదివారం గుత్తి కోట ఉత్సవాలను నిర్వహించడం జరుగుతోందని, ఇందులో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు.*

– *ఈ సందర్భంగా ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండుగగా అధికారికంగా మొల్లమాంబ జయంతి మహోత్సవం నిర్వహించడం జరుగుతోందని, ఇది కూటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు వచ్చిన తరువాతనే ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతోందన్నారు. భావితరాలు మహిళా కవయిత్రి మొల్లమాంబను ఆదర్శంగా తీసుకోవాలని, బాలికలు అందరూ బాగా చదువుకోవాలన్నారు.*

– *ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు బిసిల పక్షపాతి అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని, కవయిత్రి మొల్లమాంబ జయంతి మహోత్సవం నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనరసింహమూర్తి, తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ జయంతి మహోత్సవం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినీలకు డిఆర్ఓ, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్, తదితరులు జ్ఞాపకాలను అందించి అభినందించారు. కుమ్మరి శాలివాహన సంఘం నాయకులను శాలువా కప్పి సన్మానించారు.*

– *ఈ కార్యక్రమంలో ఏపీ అరె కటిక వెల్ఫేర్ హరిక్రిష్ణరావు, కుమార శాలివాహన ఉద్యోగ సంఘం నాయకులు ఓబులపతి, కుమార శాలివాహన సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ పోతులయ్య, కుమార సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీ కెవి.రమణ, కుమ్మర మహిళా నాయకురాలు రామంజినమ్మ, కుమ్మర సంఘం యువ నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor