అన్నదాతను మోసం చేస్తే పీడీ యాక్ట్ పెడతామని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏ.వి రంగనాథ్ హెచ్చరించారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించి, పండిన పంటను వ్యాపారులకు అమ్ముకుంటే వ్యాపారులు రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఎగవేతకు పాల్పడడం దారుణమని, అలా రైతులను మోసం చేసి డబ్బులు ఎగవేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన రవిశెట్టి రవిబాబు వరంగల్, కరీంనగర్ జిల్లాలోని రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వకుండా ఎగవేతకు పాల్పడ్డాడు. దీంతో నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనర్ తొలిసారిగా పిడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు. పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ నిందితుడికి కాజీపేట ఏసీపీ కార్యాలయంలో అందజేసి చర్లపల్లి జైలుకి తరలించారు.
ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ వివరాలను వెల్లడిస్తూ నిందితుడు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయ దారుల నుండి సుమారు 6 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు చెల్లించాల్సిన సుమారు కోటిన్నర పైగా ధాన్యం డబ్బులు చెల్లించకుండా డబ్బు ఎగవేతకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. వ్యవసాయదారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎల్కతుర్తి, ముల్కనూరు, వంగర పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై కేసులు నమోదు అయ్యాయన్నారు.
దీంతో నిందితుడిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ అయినట్టు వెల్లడించారు.వరంగల్ సీపీ ఏవి రంగనాథ్ ఈ మేరకు వ్యవసాయదారుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి వ్యాపారస్తులు సకాలంలో చెల్లింపులు చేయాలని, అలాకాకుండా వారికి ఇచ్చే డబ్బులు ఎగవేత ధోరణికి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
