రాజీవ్ గాంధీ హత్య కేసు లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రాజీవ్ గాంధీ హత్య కేసు (Rajiv Gandhi assassination case)లో సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. నళిని, రవిచంద్రన్‌, రాబర్ట్, రాజా, శ్రీహరణ్‌, జైకుమార్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ నళిని, రవిచంద్రన్ ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారించిన.. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో దోషిగా ఉన్న పేరరివాళన్‌ను మే 17న విడుదల చేస్తూ ఆదేశాలు జారీచేశామని.. అది వీరికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. దోషులు దాదాపు 30 ఏళ్లుగా జైల్లో ఉన్నారు.

సెప్టెంబరు 9, 2018న దోషులను విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ సిఫారసు చేసిందని, ప్రవర్తన కూడా బాగానే ఉండడంతో.. వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుపై నళిని స్పందించారు. తానేమీ టెర్రరిస్టును కాదన్న విషయం తనకు తెలుసని పేర్కొన్నారు. చాలా ఏళ్లు జైళ్లో మగ్గుతున్నానని.. గత 36 గంటలుగా ఎంతో మనో వేదనకు గురయ్యాయని తెలిపారు. తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలని.. తమిళనాడు ప్రభుత్వం, తన న్యాయవాదికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో పేరరివాళన్‌ ఇప్పటికే జైలు నుంచి విడుదలయ్యారు. తమిళనాడు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టినా.. గవర్నర్‌ రాష్ట్రపతికి సిఫారసు చేయడంతో.. అప్పట్లో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. పేరరివాళన్ ఇప్పటికే 30 ఏళ్లు శిక్ష అనుభించాడని.. జైల్లో సత్ప్రవర్తన కూడా ఉందని స్పష్టం చేసింది.

20 ఏళ్ల శిక్ష పూర్తైన వారు కూడా జైలు నుంచి విడుదలయిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయని.. అలాంటప్పుడు పేరరివాళన్ విషయంలో వివక్ష చూపడం సరికాదని అభిప్రాయపడింది. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి.. పేరరివాళన్ విడుదలకు ఆదేశాలు జారీచేస్తున్నట్లు జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం స్పష్టం చేసింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది. ధను మహిళ తనను తాను పేల్చుకుంది. ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది మరణించారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేల్చుతూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణ శిక్ష విధించింది. ఐతే ఆ మరుసటి ఏడాది పేరరివాళన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అనంతరం 2014లో పేరరివాళన్‌తో పాటు శాంతన్, మురుగన్ మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గించింది. 2000లో సోనియా గాంధీ జోక్యంతో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగారశిక్షకు తగ్గించారు.

YES9 TV