చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తెలుగు చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మెరిసింది. గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2025లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.
ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 9న థియేటర్లలోకి వచ్చి, తక్కువ బడ్జెట్‌తో రూపొందించినా కంటెంట్‌తో ప్రేక్షకులను అనూహ్యంగా ఆకట్టుకుని విజయాన్ని అందుకుంది. కొత్త నటీనటులైన సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు ప్రధాన పాత్రలలో నటించగా, యదు వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయంలో నిర్మాతగా నిహారిక కొణిదెల మరో సక్సెస్ సాధించారు.
తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ‘ఇఫీ’ వంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కావడం ద్వారా పెద్ద గుర్తింపును దక్కించుకుంది. ఈ ప్రదర్శన కోసం చిత్ర యూనిట్ సభ్యులు గోవాకు హాజరయ్యారు. అనుదీప్ దేవ్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించగా, కంటెంట్ పవర్ ద్వారా ‘కమిటీ కుర్రోళ్లు’ అంతర్జాతీయ వేదికను చేరుకోగలిగింది.
