ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల చేసిన “దేవుడిపై నమ్మకం లేదు” అనే వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఆయనకు గట్టిగా మద్దతుగా నిలిచారు. రాజమౌళిపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ, దేవుడిని నమ్మడం లేదా నమ్మకపోవడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కల్పించిన ప్రాథమిక హక్కు అని వర్మ స్పష్టం చేశారు. నాస్తికుడిగా ఉండటం నేరం కాదని, ప్రతి ఒక్కరికీ నమ్మకాలను ఎంచుకునే హక్కు ఉంటుందని ఆర్జీవీ తన ‘ఎక్స్’ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ ద్వారా వివరించారు.
రాజమౌళి దేవుడిని నమ్మకపోతే, ఆయనపై సినిమాలు ఎందుకు తీస్తున్నారనే వాదనను వర్మ అర్థరహితమైనదిగా కొట్టిపారేశారు. ఈ వాదనపై ఆయన ప్రశ్నిస్తూ, “ఆ లాజిక్ ప్రకారం గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్‌స్టర్‌గా మారాలా? దెయ్యం సినిమా తీయాలంటే దెయ్యం అవ్వాలా?” అని చురకలు అంటించారు. దర్శకుడు ఒక అంశంపై సినిమా తీయడానికి దాన్ని వ్యక్తిగతంగా నమ్మాల్సిన అవసరం లేదని, అది కేవలం కళాత్మక సృష్టి అని ఆయన పేర్కొన్నారు.
రాజమౌళిపై జరుగుతున్న అసలు దాడి ఆయన నాస్తికత్వం వల్ల కాదని, అది విజయం సాధించిన వ్యక్తిపై ఇతరులకు ఉన్న అసూయ వల్లనేనని ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంత పూజలు చేసినా విఫలమైన వారిలో పేరుకుపోయిన అసూయే ఈ విమర్శల రూపంలో బయటపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి, ‘వారణాసి’ సినిమాతో రాజమౌళి బ్యాంకు బ్యాలెన్స్ మరింత పెరుగుతుందని, విమర్శకులు అసూయతో ఏడవవచ్చని పేర్కొంటూ, వ్యంగ్యంగా ‘జై శ్రీరామ్’ అని వర్మ తన పోస్ట్‌ను ముగించారు.
