విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్: విద్యాశాఖ సీరియస్, షోకాజ్ నోటీసులు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, మెళియాపుట్టి మండలం, బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు సుజాత, పాఠశాలలో దర్జాగా కుర్చీలో కూర్చొని సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటూ తన జులుం ప్రదర్శించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

టీచర్ సుజాత విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో చాకిరీ చేయించుకున్న టీచర్‌కు తగిన శాస్తి జరిగిందని వారు అంటున్నారు.

ఈ వీడియో మరియు వార్తలపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఉపాధ్యాయురాలు సుజాతకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పిల్లలపై జులుం ప్రదర్శించిన టీచర్పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Posted Under AP
Editor