రాచకొండ కమిషనరేట్ షీ టీమ్స్ మహిళల భద్రత కోసం ‘డెకాయ్ ఆపరేషన్లను’ ముమ్మరం చేశాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో (గత నెల 16 నుంచి 31 వరకు) ఏకంగా 127 మంది ఈవ్ టీజర్లను (పోకిరీలను) పట్టుకోవడం షీ టీమ్స్ పనితీరుకు నిదర్శనంగా నిలిచింది. పట్టుబడిన వారిలో 80 మంది మేజర్లు కాగా, 47 మంది మైనర్లు ఉన్నారు. మహిళలు మరియు బాలికలను వెంబడించడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడుతున్న ఆకతాయిల ఆటకట్టించేందుకు, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి. ఉషారాణి పర్యవేక్షణలో ఈ మెరుపు దాడులు జరిగాయి.
షీ టీమ్స్ సిబ్బంది సాధారణ పౌరుల మాదిరిగా మఫ్టీలో బస్టాండ్‌లు, రైల్వే, మెట్రో స్టేషన్లు, విద్యాసంస్థలు (స్కూల్స్, కాలేజీలు), కూరగాయల మార్కెట్లు వంటి జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. వేధింపులకు పాల్పడుతున్న పోకిరీల చేష్టలను వీడియో రూపంలో, ఫోటోల రూపంలో సాక్ష్యాధారాలతో సహా రికార్డ్ చేసి, ఆధారాలు లభించిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ 15 రోజుల్లో షీ టీమ్స్‌కు 194 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఫోన్ ద్వారా వేధింపులు-40, సోషల్ మీడియా ద్వారా వేధింపులు-74, నేరుగా వేధించిన కేసులు-80 ఉన్నాయి.
పట్టుబడిన 127 మందిలో 7 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, 53 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. మిగిలిన 73 మంది పోకిరీలకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎల్‌బీ నగర్ సీపీ క్యాంపు కార్యాలయంలోని ఉమెన్ సేఫ్టీ ఆఫీస్‌లో కౌన్సిలర్స్‌తో ఈ కార్యక్రమం చేపట్టారు. రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు మాట్లాడుతూ, మహిళల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, బాలికలు, మహిళలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
