చేవెళ్ల దుర్ఘటన: బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల అప్డేట్‌లు వాయిదా!

 

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోవడం టాలీవుడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హృదయ విదారక ఘటనతో బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ, టాలీవుడ్‌లోని పలు ముఖ్యమైన సినిమా అప్‌డేట్‌లను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు ప్రకటించాయి.

అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘NC 24’ చిత్రం నుంచి నవంబర్ 3న మీనాక్షి చౌదరి క్యారక్టర్ పోస్టర్ రిలీజ్ చేయాల్సి ఉంది. చేవెళ్లలో జరిగిన దురదృష్టకర సంఘటన కారణంగా అప్‌డేట్‌ను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ, మృతులకు సంతాపం, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది.

అదేవిధంగా నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్రం ‘NBK 111’ నుంచి కూడా సోమవారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఇవ్వాల్సిన ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ (కథానాయిక ప్రకటన)ను వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ ఘటనపై సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Editor