గత జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందగా, విశ్వాష్‌కుమార్ రమేష్ అనే ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ‘మృత్యుంజయుడు’ అంటూ వైరల్ అయిన రమేష్ పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉంది. ఆ విషాదం తర్వాత తాను **పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)**తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది.
ప్రమాదంలో తన సోదరుడు అజయ్‌ను కోల్పోయిన రమేశ్, ఆ బాధను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని కన్నీటిపర్యంతమయ్యాడు. “నా సోదరుడు నాకు వెన్నెముక. ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నా. నా గదిలో ఒంటరిగా కూర్చుంటున్నా. నా భార్య, కొడుకుతో కూడా మాట్లాడటం లేదు” అని రమేశ్ తన మానసిక ఆవేదనను పంచుకున్నాడు. రాత్రంతా ఆలోచిస్తూ, మానసికంగా బాధపడుతున్నానని, ప్రతి రోజు మొత్తం కుటుంబానికి బాధాకరమైనదని వాపోయాడు.
శారీరకంగా కూడా కష్టాలు పడుతున్న రమేశ్, ప్రమాదం కారణంగా కాలు, భుజం, మోకాలి, వీపులో నిరంతర నొప్పి వేధిస్తోందని వివరించారు. దీని కారణంగా తాను ఏ పని చేయలేకపోతున్నానని, డ్రైవింగ్ కూడా చేయలేకపోతున్నానని తెలిపారు. తన సోదరుడితో కలిసి నిర్వహించే చేపల వ్యాపారం కూడా ప్రమాదం తర్వాత కుప్పకూలిపోయింది. ఎయిరిండియా యాజమాన్యం అందించిన రూ.25 లక్షల మధ్యంతర పరిహారం కూడా అతని తక్షణ అవసరాలకు సరిపోవడం లేదని కుటుంబసభ్యులు అంటున్నారు.
