విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు మరో గుడ్ న్యూస్..!

ఏపీలోని రెండు కీలక నగరాలు విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు ఊతం లభిస్తోంది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్ లు సిద్ధం చేసే ప్రక్రియతో పాటు టెండర్ల ప్రక్రియకూ రంగం సిద్దమవుతుండగా.. ఇప్పుడు వీటికి మరో గుడ్ న్యూస్ అందింది. దీంతో ఇవాళ ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది.

 

విజ‌య‌వాడ‌,విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల‌కు రుణాలు ఇచ్చేందుకు పలు విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు AIIB బ్యాంకు ప్ర‌తినిధుల‌తో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్టారెడ్డి స‌మావేశం అయ్యారు. ఇందులో ఏపీలో మెట్రో ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు KFW,AFD,ADB,NDB,AIIB,

జైకా,ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు ఆసక్తి చూపినట్లు ఆయన తెలిపారు.

 

విజ‌య‌వాడ‌లో ప్ర‌తిపాదిత మెట్రో కారిడార్ ల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన AIIB బ్యాంకు ప్ర‌తినిధులు.. దీనిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడతో పాటు విశాఖలో నిర్మించే రెండు మెట్రో ప్రాజెక్ట్ ల‌కు అయ్యే వ్య‌యంలో 12000 కోట్లు రుణం అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నా వేశారు. ఇందులో విశాఖ మెట్రోకు 6100 కోట్లు,విజ‌య‌వాడ మెట్రోకు 5900 కోట్లు రుణం స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యించారు.

 

ఈ మేరకు మెట్రో ప్రాజెక్టులకు త‌క్కువ వ‌డ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకుల‌తో మెట్రో కార్పొరేష‌న్ ఎండీ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.

త్వ‌ర‌లో కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో విదేశీ బ్యాంకుల ప్ర‌తినిధులు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. రెండు న‌గ‌రాల్లో మెట్రో ప్రాజెక్ట్ ఏర్పాటుకు వేగంగా ముందుకు వెళ్తున్న ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్.. ఈ మేరకు రుణసేకరణ ప్రక్రియను ముమ్మరం చేస్తోంది. దీనిపై క్లారిటీ వస్తే ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Posted Under AP
Editor