ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారిన తరుణంలో శాసన మండలి వేదికగా మంత్రి అనగాని సత్యప్రసాద్ దీనిపై స్పందించారు. 2022లో వైసీపీ ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే కొన్ని చోట్ల జిల్లా కేంద్రాల విషయంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దాంతో గత కొన్ని రోజులుగా కూటమి సర్కారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతుందనే ప్రచారం జోరందుకుంది.
ఇక ఈ విషయంపైనే శాసనమండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదని.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. అలానే వైసీపీ హయాంలో చేపట్టిన జిల్లాల పునర్వవస్థీకరణపై మంత్రి అనగాని విమర్శలు చేశారు. సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించకుండా జిల్లాలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పలు చోట్ల జిల్లా కలెక్టరేట్లలో మౌలిక వసతులు లేవని ఫైర్ అయ్యారు. అలానే కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయని మంత్రి వివరించారు.
ఏపీ కేబినెట్ భేటీ..
మరోవైపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ ముగిసింది. ఈ మంత్రివర్గ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర శాఖల మంంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కీలక బిల్లులు, ప్రతిపాదనల గురించి ఈ కేబినెట్ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో 14 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీవోలకు నేరుగా రిపోర్టు చేసేలా మార్లు చేశారు. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖలో ప్రతిపాదనలకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. 372 సివిల్ సర్జన్ పోస్టులు భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించగా… మంత్రివర్గం ఆమోదం తెలిపింది.