200 కోసం భారత కోస్ట్ గార్డ్ రహస్యాలను పాక్‌కు అమ్మేస్తున్న కూలీ..!

పాక్ గూఢచారి రోజుకు ఇచ్చే రూ. 200కు ఆశపడి భారత తీర రక్షక దళం (కోస్ట్‌గార్డ్)కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అందిస్తూ వచ్చాడో కూలి. చివరికి విషయం బయటపడటంతో ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు.

 

గుజరాత్‌లోని ద్వారకలో ఓ ప్రైవేటు కంపెనీలో కూలీగా పనిచేస్తున్న దీపేశ్ గోలీకి పాకిస్థాన్ నేవీ అధికారి అసీమాతో పేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతడిచ్చే డబ్బులకు ఆశపడి ద్వారకలోని ఓఖా పోర్టుకు చెందిన సున్నిత సమాచారాన్ని అతడికి విక్రయించేవాడు. భారత తీర రక్షక దళానికి చెందిన నౌకల కదలికల వీడియోలను వాట్సాప్‌ ద్వారా అతడికి, లేదంటే పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి పంపేవాడు.

 

ఓఖాలోని ఓ వ్యక్తి ద్వారా ఈ సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. దర్యాప్తు అనంతరం పాక్ గూఢచారికి దీపేశ్ గోలీ సమాచారం అందించడం నిజమేనని నిర్ధారించుకుని అరెస్ట్ చేసింది.

 

ఓఖా పోర్టులోని కోస్ట్ గార్డు నౌకలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉండడం అతడికి కలిసొచ్చిందని అధికారులు తెలిపారు. దీపేశ్‌కు బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో పాక్ గూఢచారికి తన స్నేహితుడి ఖాతా ఇచ్చాడు. అతడు డబ్బులు డ్రా చేసి ఇచ్చేవాడు. అలా ఇప్పటి వరకు రూ. 42 వేలు అందుకున్నాడు. దీపక్ నుంచి సమాచారం రాబట్టింది ఎవరన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Editor