ఏపీలో లక్షలాది ఉద్యోగులు సభ్యులుగా కలిగిన ఏపీ ఎన్జీవో సంఘం ఇక పేరు మార్చుకోనుంది. విజయవాడలో జరుగుతున్న ఎన్జీవోల మహాసభల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తొలిరోజు పేరు మార్పుకు సంబంధించి తీసుకున్న నిర్ణయంపై రెండోరోజు అయిన ఇవాళ తీర్మానం చేయబోతున్నారు. దీన్ని ప్రతినిధులు ఆమోదిస్తే ఏపీ ఎన్జీవోల సంఘం పేరు కాస్తాఏపీఎన్జీజీవోలుగా మారబోతోంది. అయితే దీని వెనుక ఓ కీలక కారణం ఉంది.
ఇటీవల రాష్ట్రంలోని పలు గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు ఏపీఎన్జీవోలో విలీనం అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ప్రస్తుతం నాన్ గెజిటెడ్ ఆఫీసర్లతో కూడిన ఏపీ ఎన్జీవో సంఘం కాస్తా గెజిటెడ్ ఆఫీసర్లతో కలుపుకుని ఏపీ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ అధికారుల సంఘంగా మారబోతోంది. ప్రస్తుతం ఏపీఎన్‌జీఓలో సభ్యులుగా ఉంటూ సూపరింటెండెంట్ కేడర్‌లో ఉన్న ఉద్యోగులు గెజిటెడ్ హోదా పొందారు. దీంతో వీరిని ఇందులో నుంచి తొలగించే అవకాశం లేదు. కాబట్టి ఈ సాంకేతిక కారణంతోనే పేరు మారే అవకాశం ఉంది.
గెజిటెడ్ ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్దుల్ని పరిగణనలో తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఎన్జీవో సంఘంలో ఉన్న గెజిటెడ్ అధికారుల్ని కూడా కలుపుకుని ఏపీఎన్జీజీవోగా పేరు మార్చుకునేందుకు సంఘం సిద్ధమవుతోంది. ఈ విలీనం, పేరు మార్పులతో ఏపీఎన్జీజీవో బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. రెండోరోజు మహాసభల్లో పేరు మార్పును ఆమోదించి, బైలాస్ ను కూడా సవరించేందుకు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే విలీనంపై తహసీల్దార్, సబ్ రిజిస్ర్టార్, ట్రెజరీ అధికారులు, ఏసీబీ అధికారులు ఇలా సంబంధిత గజిటెడ్ ఉద్యోగుల సంఘాలు ఏపీఎన్‌జీఓ నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చల క్రమంలో ప్రస్తుతం అతిపెద్ద ఉద్యోగుల సంఘంగా ఉన్న ఏపీఎన్‌జీఓను రాష్ట్రంలో అతిపెద్ద ఏకైక సంఘంగా మార్చేందుకు వీలుగా వ్యూహాత్మకంగా పేరు మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 26 జిల్లాల ఏపీఎన్జీవో నేతలు ఈ పేరుమార్పుకు అంగీకారం తెలిపారు.