మహారాష్ట్ర బుల్ధానా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తుండగా..
ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫలితంగా.. ఆ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో 25మంది మరణించారు.
సంబంధిత బస్సు.. యవత్మాల్ నుంచి పూణెకు వెళుతున్న సమయంలో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన జరిగింది. బస్సుకు మంటలు అంటుకున్న సమయంలో అందులో 32మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో నుంచి 25 మృతదేహాలను వెలికితీశారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన మరో 6,8 మందిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్ సజీవంగా బయటపడ్డాడు.
“రోడ్డు మీద బస్సు టైర్ ఒక్కసారిగా పేలింది. ఆ తర్వాత బస్సు స్తంభాన్ని ఢీకొట్టి తిరగబడింది. వెంటనే మంటలు అంటుకున్నాయి,” అని డ్రైవర్.. అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రపోతుండటంతో వారు వెంటనే స్పందించలేకపోయారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం మృతదేహాలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అందించడంపై దృష్టిపెట్టినట్టు స్పష్టం చేశారు.
సీఎం ఏక్నాథ్ శిందే స్పందన..
బుల్దానా బస్సు ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే స్పందించారు. ఈ వార్తతో తాను దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.