తాడిమర్రి(yes9tv )ఖేతి బచావో అభియాన్‌పై రైతులకు అవగాహన కార్యక్రమం
తాడిమర్రి: భారత ప్రభుత్వం వ్యవసాయ భూములను పరిరక్షిస్తూ, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో చేపట్టిన “ఖేతి బచావో అభియాన్ – సేవ్ ది ఫీల్డ్స్” కార్యక్రమంపై తాడిమర్రి మండలంలో రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ, నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, సుస్థిర వ్యవసాయ పద్ధతుల అమలు ద్వారా ప్రతి యూనిట్ భూమి నుంచి అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని క్రమంగా తగ్గించి, సేంద్రియ ఎరువులు, పచ్చి ఆకు ఎరువుల వినియోగాన్ని పెంచడం ద్వారా నేల సారాన్ని, ప్రకృతి పర్యావరణాన్ని, మానవ ఆరోగ్యాన్ని కాపాడవచ్చని వివరించారు.
తాడిమర్రి మండలంలోని 10 రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులు తమ భూముల మట్టి నమూనాలను పరీక్ష చేయించుకుని, భూసార స్థాయిని తెలుసుకుని దానికి అనుగుణంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలని సూచించారు. భవిష్యత్ తరాలకు సంపద కంటే ఆరోగ్యవంతమైన భూములను అందించడం గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.
రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంటను సాగు చేయకుండా పంట మార్పిడి విధానం పాటించాలని, దీనివల్ల నేల ఆరోగ్యం దెబ్బతినకుండా సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని తెలిపారు.
అలాగే బీడు, బంజరు మరియు తక్కువ వర్షపాతం ఉన్న భూముల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పీఎండీఎస్ (Pre Monsoon Dry Sowing) పద్ధతిని అనుసరించాలని సూచించారు. ఈ విధానంలో గోపంచుతము, గోవుపేడ, బంకమట్టి, బూడిద వంటి జీవామృతాలతో శుద్ధి చేసిన 10 నుంచి 15 రకాల విత్తనాలను వర్షాకాలానికి ముందే పొడి భూమిలో విత్తడం ద్వారా తక్కువ వర్షపాతం ఉన్నా రైతులకు ఏదో ఒక పంట ద్వారా ఆదాయం లభిస్తుందని తెలిపారు.
ఈ పద్ధతిలో ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు, దుంప జాతులు, టమాటా, మిరప, వంకాయ, బెండ, అలసంద, కంది, సజ్జ, ఆముదం, చిక్కుడు, గోరుచిక్కుడు తదితర పంటలను సాగు చేసి ప్రతి నెల ఆదాయం పొందవచ్చని వివరించారు. తక్కువ నీటితో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విధానం రైతులకు లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్, రైతు సేవా కేంద్రం అధికారులు కుమారి రుక్మిణి, శివ, విజయ, గౌతమి, తిరుమలేశు, వ్యవసాయ విస్తరణ అధికారి వైష్ణవి, మండల వ్యవసాయ అధికారి, అలాగే తాడిమర్రి, నర్సంపల్లి, నిడిగల్లు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఖేతి బచావో అభియాన్‌పై రైతులకు అవగాహన కార్యక్రమం..
