అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం….

తాడిమర్రి( yes9tv )అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
ట్రాక్టర్ల స్వాధీనం – మైన్స్ అండ్ జియాలజీ శాఖకు అప్పగింత
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్ఐ కృష్ణవేణి యాదవ్
తాడిమరి, జూన్ 12:
తాడిమరి మండలంలోని దాడితోట, నాయనపల్లి గ్రామాల పరిధిలో ఉన్న చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలింపుకు పాల్పడుతున్న ట్రాక్టర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పలు ట్రాక్టర్లను గుర్తించిన తాడిమరి ఎస్ఐ కృష్ణవేణి యాదవ్ నేతృత్వంలోని పోలీసు బృందం వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించింది.
అనంతరం సంబంధిత ట్రాక్టర్లను మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులకు అప్పగించగా, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేసిన వాహనాలపై శాఖ అధికారులు జరిమానాలు విధించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకం, రవాణా చేయడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణవేణి యాదవ్ మాట్లాడుతూ, సహజ వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా జరిగే అక్రమ కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.
చిత్రావతి పరివాహక ప్రాంతాల్లో నిరంతరం ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, రాత్రి వేళల్లో కూడా నిఘా బృందాలు గస్తీ నిర్వహిస్తున్నాయని తెలిపారు. అక్రమ ఇసుక రవాణా, నిల్వలు లేదా తవ్వకాలపై సమాచారం ఉన్న ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
మరోసారి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినట్లయితే కేవలం జరిమానాలతోనే కాకుండా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కృష్ణవేణి యాదవ్ హెచ్చరించారు.

Posted Under AP
Editor