అనంతపురం జిల్లా రాయదుర్గం
* వైభవంగా శ్రీ రుక్మిణీ పాండురంగస్వామి రధోత్సవం
* పండరీపుర పీఠాధిపతి గోపాల్ మహారాజ్ చే ప్రారంభం
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలంలో ఆంధ్ర పండరీపురంగా ప్రసిద్ధి చెందిన ఉంతకల్లు శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి రధోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రభాతబేరి, మంగళవాద్యాలతో పవిత్ర గంగాజలం తెచ్చి అభిషేకం, పాలాభిషేకం, పుష్పాలంకరణ, కుంకుమార్చన వంటి విశేష పూజలు నిర్వహించారు.
వేద బ్రాహ్మణుల చేత ఆలయంలో మహాగణపతి, నవగ్రహ, వాస్తు, లక్ష్మీనారాయణ హోమాలు, పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజలు చేశారు.
సాయంత్రం పండరీపుర పీఠాధిపతి గోపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో పూజలు చేసి భక్తజన సందోహం నడుమ రధోత్సవాన్ని ప్రారంభించారు.
ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వేలాది మంది భక్తులు హాజరై “విఠల.. విఠల పాండురంగ” వంటి నామస్మరణలతో భజనలు చేసి, కీర్తనలు ఆలపించారు.
ఆలయం నుండి బసవన్న ఆలయం వరకు స్వామివారి రథాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.
భక్తులు, మహిళలు అడుగడుగునా మొక్కులు తీర్చుకున్నారు.
* పల్లకీ ఉత్సవం సాయంత్రం స్వామివారి పల్లకీ మహోత్సవాన్ని రుక్మిణి పాండురంగ స్వామి ఆలయ గర్భగుడి చుట్టూ ఊరేగింపుతో ఘనంగా నిర్వహించారు.
రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బొమ్మనహాళ్ SI నబీ రసూల్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
రథోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
