దేశం గర్వించే స్థాయికి అమరావతి చేరుకోవడం ఖాయం.. -: సీఎం చంద్రబాబు..

వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రానిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. వన్ ప్లేస్ ఆల్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయమని సీఎం అన్నారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ కింద వేలాది ఎకరాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఒక్క అమరావతికి మాత్రమే దక్కుతుందన్నారు.

 

ఒకే చోట 15 బ్యాంకులు

అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ్ తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ రాజధాని పనులను పునఃప్రారంభం చేశారన్నారు. 2028 మార్చి నాటికి అమరావతి పనులు వేగంగా పూర్తి చేసేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవ్వడానికి ముఖ్య కారణం నిర్మలా సీతారామన్‌ అన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల నిధులిచ్చారన్నారు.

 

సాంకేతిక హబ్ గా అమరావతి

ఇవాళ రూ.1,334 కోట్లతో వివిధ బ్యాంకులు, బీమా సంస్థల భవనాలకు శంకుస్థాపనలు జరిగాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒకేచోట అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయడం ముఖ్యమైన అంశం అన్నారు. దీంతో 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందన్నారు. అమరావతిని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకోవడం ఖాయమని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి తయారవుతుందని సీఎం అన్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఏపీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.

 

అమరావతిలో కాస్మోస్ ప్లానెటోరియం

రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న కాస్మోస్ ప్లానెటోరియంకు సంబంధించి ఏపీ సీఆర్డీఏ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

Posted Under AP
Editor