Latest Posts

ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ వార్తల్లో నిలిచారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ శశిథరూర్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మోదీ తన ప్రసంగంలో, “తాను ఎప్పుడూ ఎన్నికల మోడ్‌లో ఉంటానని అందరూ అంటారని” పేర్కొన్నారని, అయితే వాస్తవానికి ప్రజల సమస్యల విషయంలో తాను ఎప్పుడూ ఎమోషనల్ మోడ్‌లో ఉంటానని మోదీ చెప్పారని శశిథరూర్ కితాబిచ్చారు.

అంతేకాకుండా, దేశంలో విద్యపై వలసవాదం (Colonialism) ప్రభావం గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను శశిథరూర్ సమర్థించారు. వలసవాద ఆలోచనా విధానం నుంచి బయటపడాలంటే, భారతదేశ వారసత్వం, భాషలు మరియు విజ్ఞాన వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని చెబుతూ, ప్రధాని మోదీకి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

శశిథరూర్ ప్రధాని మోదీని పదేపదే ప్రశంసించడంపై ఆయన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత కొంతకాలంగా శశిథరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని అనుకూలంగా మాట్లాడటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో స్పష్టం చేయాలని సొంత పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Editor