‘మాస్ జాతర’లో చిరంజీవి-విజయశాంతి కాంబో ఫీల్: రవితేజ, శ్రీలీల మధ్య సన్నివేశాలపై డైరెక్టర్ భాను భోగవరపు

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన మాస్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ ఈ నెల 31న విడుదల కానున్న నేపథ్యంలో, ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న భాను భోగవరపు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రవితేజను అభిమానులు ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూడబోతున్నారని భాను తెలిపారు. ఈ కథ ‘రైల్వే పోలీస్’ నేపథ్యంలో జరుగుతుందని, ఆ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే క్రైమ్ అంశాలు కొత్తగా ఉంటాయని అన్నారు. సినిమా కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయని రవితేజ గారే ఈ ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను సూచించారని, దీంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని భాను వివరించారు.

‘మాస్ జాతర’లో విలన్ పాత్ర అయిన ‘శివుడు’ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, సినిమా విడుదల తర్వాత ఈ పాత్ర గురించే అందరూ మాట్లాడుకుంటారని భాను భోగవరపు అభిప్రాయపడ్డారు. ఈ పాత్ర కోసం మొదట ఇద్దరు ముగ్గురు నటులను పరిశీలించినా, చివరకు నటుడు నవీన్ చంద్రను ఎంపిక చేశామని తెలిపారు. నవీన్ చంద్రకు కథ వినిపించిన తర్వాత ఆయన వెంటనే అంగీకరించారని, లుక్ కోసం ప్రత్యేకంగా మేకోవర్ చేసి ఫోటోషూట్ చేయగా, ఆ లుక్ నిర్మాత నాగవంశీతో సహా అందరికీ నచ్చిందని చెప్పారు. ఈ శివుడు పాత్రకు నవీన్ చంద్ర పూర్తి న్యాయం చేశారని దర్శకుడు పేర్కొన్నారు.

హీరోయిన్ శ్రీలీల పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యముందని డైరెక్టర్ భాను స్పష్టం చేశారు. ఈ పాత్ర కోసం వేరే హీరోయిన్‌ను అనుకోలేదని, కథ రాస్తున్నప్పుడు, వింటున్నప్పుడు కూడా తులసి పాత్రకు శ్రీలీల మాత్రమే గుర్తుకొచ్చారని తెలిపారు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో శ్రీలీల కొత్తగా కనిపిస్తారని చెప్పారు. ముఖ్యంగా, వీరిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చెబుతూ, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో చిరంజీవి, విజయశాంతి మధ్య కామెడీ టచ్‌తో కూడిన సన్నివేశాలు ఎలా ఎంటర్‌టైన్ చేస్తాయో, ఇందులో రవితేజ, శ్రీలీల మధ్య సన్నివేశాలు కూడా అదే విధంగా ఉంటాయని హామీ ఇచ్చారు. దర్శకుడిగా ఇది తొలి సినిమా అయినా, నిర్మాత నాగవంశీ పూర్తి సహకారం అందించారని, ‘జాతర’ ఎపిసోడ్ కోసం భారీ సెటప్ వేశారని భాను తెలిపారు.

Editor