వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గోరంట్ల మాధవ్‌ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన వైఎస్ జగన్.. గత కొన్ని రోజులుగా జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
పలు జిల్లాల్లో జిల్లా పార్టీ ఇన్ చార్జిలు, నియోజకవర్గ ఇన్ చార్జిలను మార్పు చేస్తున్నారు. పలువురు సీనియర్ నేతలకు రాష్ట్ర కమిటీలో పదవులను కట్టబెడుతున్నారు. ప్రత్యర్ధులపై తమ వాగ్దాటితో విరుచుకుపడే నేతలను పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత వెంటనే అదే జిల్లాకు చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి రాకముందు అనంతపురం జిల్లాలో పోలీస్ అధికారి (సీఐ)గా బాధ్యతలు నిర్వహించారు. నాడు సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డిపై మీసం తిప్పి సవాల్ చేయడంతో గోరంట్ల మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. 2018లో పోలీస్ అధికారి ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసి వైసీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో హిందూపురం లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పపై గోరంట్ల మాధవ్ విజయం సాధించారు.