ఒకే దేశం – ఒకే ఎన్నిక..! కేంద్రం వాదనేంటి..?

సువిశాల భారతావనిలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములాంటి వ్యవహారం. నిత్యం ఏదో ఓ మూలన ఎన్నికల సందడి కనిపిస్తూనే ఉంటుంది. అయితే.. పార్లమెంట్, అసెంబ్లీ.. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు సర్వసాధారణం. ఈ విధానాన్ని పూర్తిగా మార్చేయాలని భావిస్తున్న కేంద్రంలోని బీజేపీ.. జమిలి ఎన్నికలకు సై అంటోంది. ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వస్తున్నా, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది. ఏన్డీయే రెండో సారి అధికారంలో ఉన్నప్పటి నుంచి జమిలి చర్చను ప్రజల్లోకి తీసుకురాగా.. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఆచరణకు అడుగు దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే అసలు ఇప్పుడు అమలవుతున్న విధానం ఏంటీ.? జమిలికి మారడం వల్ల రానున్న ప్రయోజనాలేంటి.? ప్రతిపక్షాలు, స్థానిక పార్టీల అభ్యంతరాలేంటి.? ఈ కథనంలో తెలుసుకుందాం..

 

భారత రాజ్యాంగం నిర్దేశించిన మేరకు స్థానిక సంస్థల నుంచి దేశ పార్లమెంట్ వరకు పరిపాలనా వ్యవస్థలకు ఎన్నికైన సమయం నుంచి ఐదేళ్ల పాటు అధికారం లభిస్తుంది. ఏదైనా కారణాలతో ఆయా పరిపాలనా వ్యవస్థ అధికారం నుంచి దిగిపోతే, కోల్పోయినా.. మరోమారు ఎన్నికలు నిర్వహించి కొత్త వ్యవస్థను నెలకొల్పాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంటుంది. కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో కార్యనిర్వహక వ్యవస్థల సహకారంలో ఎన్నికల సంఘం ఎన్నికల్ని సజావుగా నడిపిస్తోంది. అయితే.. ఇప్పుటి వరకు ఒక తీరు, జమిలి అమలైతే మరో తీరుగా ఎన్నికల ప్రక్రియ ఉండనుంది.

 

ఇప్పుడు దేశంలో ఎన్నికల తీరేంటి

 

దేశంలోని వివిధ స్థాయిల్లోని పరిపాలనా వ్యవస్థలకు ఎన్నికలు నిర్వహించి..ఐదేళ్ల పరిపాలనా సమయాన్ని ఇస్తుంటారు. ఈ కాలంలో పూర్తిగా అధికార సమయాన్ని వినియోగించుకుంటే సమస్య లేదు కానీ.. వివిధ బాహ్య, అంతర్గత సమస్యలతో అసెంబ్లీ, పార్లమెంట్లు రద్దయినా.. స్థానిక సంస్థల పరిపాలనా వ్యవస్థలు రద్దైనా.. మళ్లీ ఎన్నికలకు వెళతారు. కొత్త సభ కొలువు దీరిన తర్వాత నుంచి మళ్లీ ఐదేళ్ల పాటు అధికారం సంక్రమిస్తుంటుంది. ఈ విధానంతోనే కేంద్రం విభేదిస్తోంది. ఇలా.. విశాల దేశంలో నిత్యం ఎన్నికలు జరిగితే ఎలా అని ప్రశ్నిస్తోంది. అందుకే.. జమిలి ఎన్నికలే బెస్ట్ అంటూ చెబుతోంది.

 

జమిలితో రానున్న మార్పులు ఏంటి

 

తొలిదశలో దేశవ్యాప్తంగా పార్లమెంటుకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. దాంతో.. దేశంలో ఎక్కడా ఎన్నికలు అనే మాట వినిపించదు. ఆ తర్వాత కొన్నాళ్లకు స్థానిక సంస్థలను కూడా ఇందులో భాగం చేయనున్నారు. దాంతో.. స్థానికం నుంచి దేశ స్థాయి వరకు ఒకేసారి ఎన్నికలు పూర్తవుతాయి అన్నది కేంద్రం వాదన. ఒకవేళ ఏ అసెంబ్లీ అయినా మధ్యలోనే రద్దుయితే.. దాని స్థానంలో నిర్వహించే ఎన్నికలు ఇకపై ఐదేళ్ల కాలపరిమితిలో ఉండవు అన్నది కొత్త నిబంధన. మధ్యంతర ఎన్నికల సమయం నుంచి జమిలి ఎన్నికలు ఎప్పటి వరకో.. ఆ అసెంబ్లీ కాలపరిమితి అప్పటి వరకే ఉండనుంది. అంటే.. ఉదాహరణకు – ఏదైనా రాష్ట్రానికి జమిలిలో భాగంగా 2025 లో ఎన్నికలు జరిగి సభ కొలువు తీరింది అనుకుందాం. అప్పుడు.. ఆ అసెంబ్లీ గడువు 2030 వరకు ఉంటుంది. కానీ.. రెండేళ్ల తర్వాత అంటే 2027లో ఏవైనా కారణాలతో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే.. కొత్తగా ఏర్పడనున్న అసెంబ్లీ పదవీ కాలం అంతకు ముందులా ఐదేళ్లు ఉండదు. జమిలి నిబంధనల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికలు జరిగే 2030 వరకే. అంటే.. ఆ అసెంబ్లీ గడువు కేవలం మూడేళ్లే ఉంటుంది. ఇదీ.. జమిలిలో ఉండే అసలు తిరకాసు.

 

కేంద్రం చెబుతున్నదేంటి..

 

రాష్ట్ర స్థాయిలో కానీ, స్థానిక సంస్థలకు కానీ ఎన్నికల జరుగుతుంటే అక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దాంతో.. అక్కడ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు కానీ, నూతన పథకాల ప్రారంభం కానీ.. ఆయా ప్రాంత ప్రజల అవసరాలు తీరేలా ఎలాంటి నిధుల విడుదలకు కానీ అవకాశం ఉండదు. ఈ కారణంగానే.. మిగతా ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనుల్ని పక్కన పెట్టేస్తుంటాయి ప్రభుత్వాలు. జమిలి ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టాలనేది కేంద్రం ప్రయత్నం. దాంతో పాటే.. కార్యనిర్వహణలో ఉండాల్సిన సిబ్బందిని నిత్యం వివిధ ఎన్నికల్లో వినియోగించడం వల్ల అసలు ప్రయోజనాలు నెరవేరడం లేదంటున్నారు. పైగా.. పోలీసులు, రిజర్వ్ పోలీసులు సహా మిగతా యంత్రాంగం మొత్తం నిత్యం ఎన్నికల విధుల్లోనే ఉండాల్సి వస్తుందన్నది ప్రధాన వాదన. అలాగే.. పార్లమెంట్ స్థాయి ఎన్నికలకు గస్తీ తిరిగే పోలీసులు, అసెంబ్లీ ఎన్నికలకు మరోసారి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి పని చేయాల్సి ఉంటుంది. అల్లర్ల నియంత్రణకు నిఘా, డబ్బూ, ఇతర ప్రలోభాలకు గురిచేయకుండా నిరోధించేందుకు ఒకే ప్రాంతంలో వేరువేరు సార్లు తిరగాల్సి ఉంటుంది. దీని వల్ల నిర్వహణ వ్యయం ప్రభుత్వాలకు మోయలేని భారంగా మారుతుందని అంటున్నారు. అదే.. జమిలి పద్ధతిలో అయితే ఒకే సారి పోలీసు నిఘా, గస్తీ, ఎన్నికల సిబ్బంది సహా.. అనేక విషయాలు కలిసి వస్తాయని చెబుతున్నారు.

 

ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి..

 

కేంద్రం జమిలి ద్వారా స్థానిక పార్టీలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఒకేసారి కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే.. జాతీయ ప్రయోజనాలే ఎన్నికల ప్రధానాంశాలుగా మారుతాయి తప్పా.. రాష్ట్రాల అవసరాలు, కోరికలకు చోటు ఉండదనేది ఈ పార్టీల వాదన. ఉదాహరణకు.. జమిలి ఎన్నికల సమయంలో పాకిస్థాన్ వంటి దాయాది దేశంలో గొడవలు జరిగితే.. ఆ అంశం చుట్టూనే ఎన్నికలు జరుగుతాయి తప్పా.. రాష్టాలకు కావాల్సిన అంశాలపై చర్చ జరగదని వాదిస్తున్నారు. అలానే.. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే.. అన్ని చోట్ల ఓటరు ఒకే పార్టీకి, లేదా కూటమి వైపు మొగ్గుతాడని.. రాష్ట్ర స్థాయిలో రెండో ఎంపికకు వెళ్లడనేది ప్రతిపక్షాలు చెబుతున్న మాట. ఇటీవల.. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలను పరిశీలిస్తే.. స్థానికంగా ఏ పార్టీలకు ప్రజలు మద్ధతు పరికారో, పార్లమెంట్ స్థానానికి అదే పార్టీకి మద్ధతుగా నిలవడాన్ని ఆలోచించాలని చెబుతున్నారు. దీన్ని బట్టి.. ప్రాంతీయ పార్టీల ప్రాణం తీయడంతో పాటు కేంద్రీకృత పాలనా విధానం వైపు దేశాన్ని మళ్లించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

 

ప్రస్తుత విధానంలో విడివిడిగా ఎన్నికలు నిర్వహించేందుకే.. ఎన్నికల సిబ్బంది, ఈవీఎం లు సరిపోని సందర్భంలో ఒకేసారి ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నాయి. పైగా.. ఈ స్థాయిలో ఈవీఎం ల నిల్వలు, రక్షణ బాధ్యతలు ఏంటని అంటున్నారు. విభిన్న పరిస్థితులుండే దేశంలో… ఏదైనా ఓ ప్రాంతంలో అల్లర్లు చెలరేగితే ఎలా కట్టడి చేస్తారని.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉండే బలగాలను అప్పటికప్పుడు తరలింపు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

Editor