ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకమని, బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని సొంత పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఫిరాయింపులపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమంటూ కీలక వ్యాఖ్య చేశారు. పార్టీలో చేరికల గురించి మాట్లాడుతూ… అందరితో చర్చించాకే ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్లు తెలిపారు.
తమకు ప్రతి ఒక్కరూ అవసరమేనని… ఏ కార్యకర్తనూ వదులుకోమన్నారు. ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను చేర్చుకోవాలన్నది అధిష్ఠానం నిర్ణయమే అన్నారు. పెద్దల సూచన ప్రకారమే ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్లు తెలిపారు. జీవన్ రెడ్డి ప్రతిష్ఠకు ఎక్కడా భంగం వాటిల్లదని హామీ ఇచ్చారు. ఆయన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యపై ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు.
ఈ హత్య కేసుపై విచారణ సాగుతోందని, త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే తాను జీవన్ రెడ్డితో మాట్లాడానని గుర్తు చేశారు. ఆయన ఆవేదనలో ఉన్నారని, అందుకే అలా మాట్లాడుతున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు పాతవారిని కలుపుకు పోవాలని సూచించారు. జగిత్యాల మాత్రమే కాదని, ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త, పాత నాయకుల సమస్య ఉందన్నారు.