ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తయిపోయినా సజీవంగా ఉన్న కేంద్ర హామీ ప్రత్యేక హోదా. దీన్ని కేంద్రంతో అమలు చేయిస్తామంటూ గతంలో వైసీపీ, టీడీపీ జనంతో ఓట్లు వేయించుకున్నాయి. అయినా కేంద్రం నిర్లక్ష్యం కారణంగా ఇది అమలుకు నోచుకోలేదు. దీంతో జనం కూడా ప్రత్యేక హోదా హామీ గురించి దాదాపు మర్చిపోయారు. ఇలాంటి తరుణంలో విపక్ష వైసీపీ మరోసారి ప్రత్యేక హోదాను తెరపైకి తెస్తోంది. దాంతో పాటు అధికార టీడీపీని సైతం లింక్ చేస్తోంది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇవాళ కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి హాజరైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే టీడీపీ మాత్రం దీనిపై మాట్లాడలేదు. దీనిపై సాయిరెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించకపోవడం ఏంటని ఇద్దరూ ప్రశ్నించారు.
అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమన్నారు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాత్రం ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకోవడం ఖాయమన్నారు. లోపాయికారీ ఒప్పందాలు లేకపోతే మాత్రం ఈసారి ఏపీకి ప్రత్యేక హోదా లభించడం ఖాయమని సాయిరెడ్డి స్పష్టం చేశారు. తద్వారా టీడీపీపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ ఇవేవీ పట్టించుకోవడానికి సిద్ధంగా లేదు.