17ఏళ్ల యువకుడి మరణం నేపథ్యంలో ఫ్రాన్స్ దేశం నిరసనలతో అట్టుడికిపోతోంది. ఫ్రాన్స్‌లోని ప్రధాన నగరాల్లో నిరసనలు తారస్థాయికి చేరాయి.
దాదాపు 3 రోజుల పాటు అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రజా వ్యవస్థపై భారీ ప్రభావం పడింది.
ఎందుకు ఈ నిరసనలు..
ఫ్రాన్స్‌లో మంగళవారం జరిగిన ఘటనే.. తాజా హింసకు కారణం. నాహెల్ అనే యువకుడిపై ఓ పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ట్రాఫిక్ చెక్‌ను అతను అధిగమించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో 17ఏళ్ల నాహెల్ ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఫ్రాన్స్‌లో జాతి వివక్ష ఉందని, బహుళ జాతి సమాజాలపై జరుగుతున్న దాడులకు ఈ ఘటన చిహ్నం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ చెక్‌ను అధిగమించినంత మాత్రాన చంపే హక్కు పోలీసులకు లేదంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి.
France protests latest news : ప్రధాన నగరాల్లో 40వేలకుపైగా మంది పోలీసులు, ఎలైట్ రైడ్, జీఐజీఎన్ యూనిట్ బృందాలు భద్రతా చర్యలు చేపట్టాయి. కానీ పెద్దగా ఫలితం దక్కడం లేదు. నిరసనలకు గంటగంటకు భారీ ఎత్తున మద్దతు పెరుగుతోంది. ఇప్పటివరకు 600మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయిందని తెలుస్తోంది. ఫ్రాన్స్‌వ్యాప్తంగా అనేక నగరాల్లో వాహనాలకు నిరసనకారులు నిప్పంటించారు. పలు భవనాలను ధ్వంసం చేశారు. లిల్లే ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు నిప్పంటించారు. తమకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతోనూ వాగ్వాదానికి దిగుతున్నారు. ఫలితంగా ఇప్పటివరకు వివిధ ఘటనల్లో 249మంది పోలీసులు గాయపడ్డారు.
నాహెల్ తల్లి స్పందన ఇది..
నాహెల్‌ను అతని తల్లి పెంచింది. తాను కష్టపడి, కుమారుడిని పైకి తీసుకొచ్చింది. 17ఏళ్ల నాహెల్ పెద్దగా చదువుకోలేదు. అయితే డెలివరీ బాయ్‌తో పాటు వివిధ పనులు చేస్తుంటాడు. అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డ్ కూడా లేదు. నాహెల్ ఒక మంచి అబ్బాయి అని, అతని గురించి తెలిసివారందరు చెబుతున్నారు.
మరోవైపు తన బిడ్డ మరణంపై నాహెల్ తొల్లి తొలిసారిగా స్పందించారు.
“నేను పోలీసు వ్యవస్థను నిందించడం లేదు. ఆ ఒక్క అధికారిపైనే ఆ కోపం అంత. నా బిడ్డ ప్రాణాలను అతనే తీశాడు. నా కుమారుడు అరబ్ అని తెలిసే, అతని ప్రాణాలు తీశాడు,” అని నాహెల్ తల్లి మౌనియా ఆరోపించారు.
మరోవైపు.. నాహెల్ మరణంపై ఫ్రాన్స్ పోలీసుశాఖ కూడా స్పందించింది.
France shooting news : “ఈ ఘటన చాలా దురదృష్టకరం. కానీ నాహెల్‌ను చంపడం ఆ పోలీసు ఉద్దేశం కాదు. మేము రోజు నిద్రలేచి, ఎవరినో ఒకరిని చంపాలని అనుకోము,” అని అధికారులు చెబుతున్నారు. కాగా.. నాహెల్పై కాల్పులు జరిపిన పోలీసుకు సంబంధించిన వివరాలను అధికారులు చెప్పడం లేదు. కాగా.. ఘటనకు కారణమైన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మాత్రం స్పష్టం చేశారు.