తెలుగు రాష్ట్రాల్లో అట్టడుగున బీజేపీ.. ఎక్కడ తప్పు జరిగింది?

ప్రపంచంలోనే తమది అతిపెద్ద పార్టీ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశంలో ఎక్కడకెళ్లినా, సభల్లో ఫీుంకరిస్తుంటారు.

సభ్యత్వాల విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీని కూడా అధిగమించామని అమిత్‌ షా 2015లో ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎదుగుబొదుగూ లేకుండా ఎదురీదుతోంది. దశబ్దాలుగా తెలుగునాట బీజేపీది ఇదే పరిస్థితి. బీజేపీని ఒక శక్తిగా మార్చిన అటల్‌ బిహారి వాజ్‌పేయి, ఎల్‌.కే అడ్వాణీల నాయకత్వంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడు మోదీ, అమిత్ షాల కాలంలోనూ తోక పార్టీగానే మిగిలిపోతోంది.

ఎందుకు బీజేపీని తెలుగువాళ్లు దూరం పెడుతున్నారు? అనే ప్రశ్నకు పలు సమాధానాలు ఉన్నాయి. ఈ సమాధానాల సమాహారాన్ని అర్థం చేసుకోవాలంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రముఖుడి ఒకరి మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆయన ఒక ప్రముఖ పాత్రికేయుడితో ముచ్చటిస్తూ ‘ప్రయత్నిస్తే పాకిస్తాన్‌లో అయినా బీజేపీ గెలుస్తుంది. కానీ, తెలుగు రాష్ట్రాలో మాత్రం గెలవదు’ అని బల్లగుద్ది చెప్పారు. ఇటీవల పరిస్థితులు చూస్తుంటే, ఆయన మాటను నిజం చేసే పనిలో బీజేపీ నాయకులు నిమగ్నమైనట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

బీజేపీ దశబ్దాలుగా ఒక ప్రణాళిక ప్రకారం ఎదుగుతూ వచ్చిన పార్టీ. ఆర్‌.ఎస్‌.ఎస్‌ శిక్షణలో మూలాల నుంచి మంచి నాయకత్వాన్ని నిర్మించుకున్న పార్టీ. బలమైన వేర్లతో పార్టీని నిర్మించే బీజేపీ, తెలుగునాట దీనికి రివర్సుగా వేర్లను వదిలి అరువు నాయకులతో కొమ్మలను అంటుగడుతూ వస్తున్నది. అందుకే, గాలి గట్టిగా వచ్చినప్పుడల్లా పేకమేడలా కూలిపోతున్నది. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఒక్క మాస్‌ లీడర్‌ కూడా తెలుగు రాష్ట్రాల బీజేపీలో పుట్టకపోవడమే దీనికి నిదర్శనం.

అరువు నాయకులే దిక్కు

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఉన్నవాళ్లలో అరువు నాయకులే ఎక్కువగా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగలడానికి ప్రధాన కారణం ప్రాంతీయంగా మాస్‌ లీడర్లు లేకపోవడమే అని గుర్తించిన పార్టీ అధిష్టానం ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడానికి ప్లాన్‌ వేసింది. దీని కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా చేరికల కమిటీని నియమించి విస్తూపోయేలా చేసింది.

అంతేకాదు ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో బీజేపీ బలహీనంగా ఉందని, ఈ మూడు జిల్లాల్లో ఎక్కడో ఒక చోట ఉపఎన్నిక తీసుకొచ్చి గెలిపించుకుంటే పార్టీ బలపడుతుందని అమిత్‌ షాకి ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చే అసోసియేషన్‌ ఆఫ్‌ బిలియన్‌ మైండ్స్‌ సంస్థ నివేదిక ఇచ్చింది. దీనికనుగుణంగా అమిత్‌ షా, మునుగోడు ఉప ఎన్నికకు తెరలేపారు. మొదటి నుంచి అసలు రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయడమే తప్పని, ఆయన ఓడిపోతాడని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పారు. కానీ, అహంకారంతో ఉపఎన్నికకు వెళ్లి బొక్కబొర్లా పడ్డారు. దాంతో పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది బీజేపీ పరిస్థితి.

అరువే.. బరువు

అరువు నాయకుల ప్రయోగం పశ్చిమ బెంగాల్‌లో పనిచేయలేదు. తృణముల్‌ కాంగ్రెస్‌ నుంచి చేర్చుకున్న నాయకులకు జాతీయ పదవులు కట్టబెట్టినా, ఎన్నికల ఫలితాల తర్వాత వారంతా తిరిగి సొంత గూటికే చేరిపోయారు. కాంగ్రెస్‌ రక్తంతో నిండిపోయిన తెలుగు రాష్ట్రాల బీజేపీలోనూ ఇలాంటి పరిస్థితులే రిపీట్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టినా కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్‌ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల నాటికి ఈ అరువు నాయకుల్లో ఎంతమంది ఉంటారు? ఎందరు వెళ్లిపోతారు? అనే గుసగుసలు పార్టీలో వినపడుతున్నాయి.

YES9 TV